సర్దుబాటుపై ససేమిరా!

29 Jul, 2022 02:42 IST|Sakshi
మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్‌రావు 

ఇతర శాఖల్లోకి వెళ్లేందుకు వీఆర్వోల విముఖత

సాక్షి, హైదరాబాద్‌: గ్రామరెవెన్యూ అధికారు(వీఆర్వో)లకు ప్రభుత్వం న్యాయం చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తామని వీఆర్వోల జేఏసీ స్పష్టం చేసింది. గురువారం ఇక్కడి సీసీఎల్‌ఏ కార్యాలయంలో స్టీరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వీఆర్వోల జేఏసీ చైర్మన్‌ గోల్కొండ సతీశ్‌ మాట్లాడుతూ వీఆర్వోలను వివిధ శాఖల్లో ప్రభుత్వం సర్దుబాటు చేస్తుందన్న వార్తలతో తాము తీవ్ర మనోవేదనకు గురవుతున్నామన్నారు.

వీఆర్వోల జేఏసీని సంప్రదించిన తర్వాతే సర్దుబాటు ప్రక్రియపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులను ఏ ఒక్క వీఆర్వో కూడా స్వీకరించబోరని స్పష్టం చేశారు. అశాస్త్రీయ పద్ధతిలో వీఆర్వో పోస్టులను రద్దు చేయడం అమానుషమన్నారు. ఏకపక్ష నిర్ణయంతో ఇతర శాఖల్లోకి వీఆర్వోలను బదిలీ చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే సమానహోదాతో సర్దుబాటు చేయాలని, అర్హులైన వీఆర్వోలకు సీనియర్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్‌ ఇవ్వాలని కోరారు. 

ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని, సమస్యల పరిష్కారానికే న్యాయ పోరాటం చేస్తున్నామని రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికే ఉపేందర్‌రావు అన్నారు. గురువారం రామచంద్రాపురంలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర శాఖల్లోకి వీఆర్వోలను బలవంతంగా సర్దుబాటు చేస్తే సర్వీస్‌ పరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు