పనసకాయ.. షుగర్‌ ఆటకట్టు! 

24 Sep, 2022 03:19 IST|Sakshi

పచ్చి పనసపొట్టు పిండితో మధుమేహాన్ని నియంత్రించొచ్చని శాస్త్రీయ పరిశోధన 

శ్రీకాకుళం మెడికల్‌ కాలేజీలో జరిగిన అధ్యయనంలో వెల్లడి 

అధ్యయన ఫలితాలను ప్రకటించిన జాక్‌ఫ్రూట్‌365 సంస్థ 

సాక్షి, హైదరాబాద్‌: మధుమేహ చికిత్సలో ప్రభావవంతమైన వైద్య పోషకాహార చికిత్సగా పచ్చి పనసపొట్టు పిండి పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ అధ్యయనం నిరూపించింది. శ్రీకాకుళంలోని ప్రభుత్వ వైద్య విజ్ఞాన సంస్థలో జరిగిన ఈ అధ్యయనంలో పచ్చి పనసపొట్టు పిండి ప్రయోజనాలను గుర్తించారు. పచ్చి పనసపొట్టు పిండికి మధుమేహ రోగుల్లో బ్లడ్‌ షుగర్‌ స్థాయిలను నియంత్రించే శక్తి ఉందని నిర్ధారించారు.

ఈ అధ్యయన ఫలితాలను ‘జాక్‌ఫ్రూట్‌365’ సంస్థ వ్యవస్థాపకుడు జేమ్స్‌ జోసెఫ్‌ పలువురు వైద్య నిపుణులతో కలసి శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నిత్యం తగిన మోతాదులో పచ్చి పనసపొట్టు పిండిని తీసుకోవడం వల్ల బ్లడ్‌ షుగర్‌ నియంత్రణలో ఉంటున్నట్లు వైద్య బృందం సైతం నిర్ధారించిందన్నారు. 

రోజుకు 30 గ్రాముల పచ్చి పనసపొట్టు తీసుకుంటే.. 
‘జాక్‌ఫ్రూట్‌365’ సంస్థ వ్యవస్థాపకుడు జేమ్స్‌ జోసెఫ్‌ పేర్కొన్న వివరాల ప్రకారం... ఈ అధ్యయనం కోసం షుగర్‌ మాత్రలు వాడుతున్న 18 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మొత్తం 40 మంది టైప్‌–2 మధుమేహ రోగులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్‌లోని రోగులకు మూడు టేబుల్‌స్పూన్‌లకు సమానమైన 30 గ్రాముల పచ్చి పనసపొట్టు పిండిని 12 వారాలపాటు అందించారు.

అలాగే మరో గ్రూప్‌లోని రోగులకు అంతే పరిమాణంలో పిండి తరహా పదార్థాన్ని అందించారు. ఈ అధ్యయన కాలంలో మధుమేహ రోగుల్లోని హెచ్‌బీఏ1సీ స్థాయిల్లో మార్పులతోపాటు ఫాస్టింగ్‌ ప్లాస్మా, గ్లూకోజ్, పోస్ట్‌ ప్రాండియల్‌ ప్లాస్మా గ్లూకోజ్‌ (పీపీజీ), లిపిడ్‌ ప్రొఫైల్, శరీర బరువును పరీక్షించారు. అలాగే గ్రీన్‌ జాక్‌ఫ్రూట్‌ ఫ్లోర్‌ను రోగుల రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించారు. వాటి ఫలితాల ప్రకారం పచ్చి పనసపొట్టు పిండి తీసుకున్న రోగుల్లో హెచ్‌బీఏ1సీ, ఫాస్టింగ్‌ బ్లడ్‌ గ్లూకోజ్, పోస్ట్‌ ప్రాండియల్‌ గ్లూకోజ్‌ (పీపీజీ)లో గణనీయంగా క్షీణత కనిపించింది. 

అధ్యయన ఫలితాలు ప్రోత్సాహకరం: వైద్య నిపుణులు 
ఈ అధ్యయనాన్ని మధుమేహ రోగులకు ప్రోత్సాహకరమైన వార్తగా ఫెర్నాండేజ్‌ ఆసుపత్రి కన్సల్టెంట్‌ న్యూట్రిషియనిస్ట్‌ డాక్టర్‌ లతా శశి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభివర్ణించారు. అహ్మదాబాద్‌కు చెందిన డయాబెటాలజిస్ట్‌ డాక్టర్‌ వినోద్‌ అభిచందానీ వర్చువల్‌ పద్ధతిలో మాట్లాడుతూ పచ్చి పనసపొట్టు పిండిని తన రోగులు వినియోగించడం ద్వారా వారు ఆరోగ్య ప్రయోజాలను పొందారన్నారు.

ఇదే తరహా సూచనలను అమెరికన్‌ డయాబెటిక్‌ అసోసియేషన్‌ సైతం చేసిందన్నారు. పచ్చి పనసపొట్టు పిండిలో పీచు పదార్థాలు అధికంగా లభిస్తాయని, దీనివల్ల తీసుకొనే కేలరీలు తగ్గడంతోపాటు గ్లైసెమిక్‌ లోడ్‌ తక్కువగా ఉంటుందన్నారు. జాక్‌ఫ్రూట్‌365 సంస్థ అందించే గ్రీన్‌ జాక్‌ఫ్రూట్‌ ఫ్లోర్‌ను ఒక టేబుల్‌ స్పూన్‌ మోతాదులో ప్రతిరోజూ భోజన సమయంలో వినియోగించడం వల్ల కార్బోహైడ్రేట్లు, కేలరీల స్వీకరణ తగ్గుతుందన్నారు. మెడికల్‌ న్యూట్రిషన్‌ థెరఫీలో పచ్చి పనసపొట్టు పిండి సామర్ధ్యంపై క్లినికల్‌ అధ్యయనం చేసేందుకు శ్రీకాకుళం మెడికల్‌ కాలేజీని తాము ఎంచుకున్నట్లు డాక్టర్‌ అంతర్యామి మహారాణా చెప్పారు.  

మరిన్ని వార్తలు