సమాచారం అడిగితే.. తెల్లకాగితాలు పంపారు 

9 Jul, 2022 00:58 IST|Sakshi
పోస్టులో వచ్చిన తెల్లకాగితాలు చూపుతున్న అనిల్‌కుమార్‌

జడ్చర్ల మున్సిపల్‌ అధికారుల నిర్వాకం 

జడ్చర్ల: సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద సమాచారం అడిగిన ఓ వ్యక్తికి అధికారులు వివరాలేమీ లేని తెల్లకాగితాలు పంపారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక రంగారావుతోటలో నివాసం ఉంటున్న సామాజికవేత్త అనిల్‌కుమార్‌ 40 రోజుల క్రితం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని మిషన్‌ భగీరథ, సీసీ రోడ్లు తదితర సమస్యలపై పూర్తి వివరాలు అందించాలని ఆర్టీఐ కింద మున్సిపల్‌ అధికారులకు దరఖాస్తు చేశారు.

ఈ క్రమంలో అనిల్‌కుమార్‌కు సంబంధిత అధికారులు పోస్టులో ఓ కవర్‌ పంపారు. దాన్ని విప్పి చూసిన అనిల్‌కుమార్‌ ‘తెల్ల’బోయారు. అందులో ఎలాంటి వివరాలు లేకుండా తెల్లకాగితాలు మాత్రమే ఉన్నాయి. ఈ విషయాన్ని ఆయన వెంటనే స్థానిక విలేకరుల దృష్టికి తెచ్చారు. దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌ మహ్మద్‌ షేక్‌ను వివరణ కోరగా తాము పూర్తి సమాచారాన్ని కవర్‌లో పెట్టి పోస్టు చేశామని, ఇందుకు సంబంధించిన కాపీ ఒకటి తమ దగ్గర ఉందని పేర్కొన్నారు. అయితే మున్సిపల్‌ అధికారుల నిర్వాకాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని అనిల్‌కుమార్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు