Jaffrey: హైదరాబాద్‌ ‘స్థానిక’ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జాఫ్రీ

21 Feb, 2023 03:10 IST|Sakshi

ఈ నెల 23న నామినేషన్‌ వేసేందుకు సిద్ధం

బీజేపీ పోటీ చేయకుంటే మూడోసారి ఏకగ్రీవమయ్యే చాన్స్‌

హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ సీటుకు జరుగుతున్న ఎన్నికలో బీఆర్‌ఎస్‌ మద్దతుతో బరిలోకి దిగేందుకు ఎంఐఎం సన్నాహాలు చేసుకుంటోంది. ఆ పార్టీ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్సీ సయ్యద్‌ అమీనుల్‌ హసన్‌ జాఫ్రీ మరోమారు పోటీ చేస్తున్నారు. ఈ నెల 23న జాఫ్రీ నామినేషన్‌ పత్రాలు సమర్పించనున్నారు.  వచ్చే నెల 13న పోలింగ్‌ జరగనుంది.   బీఆర్‌ఎస్‌ మద్దతుతో ఎంఐఎం తరఫున బరిలోకి దిగుతున్నారు.

పాత్రికేయుడిగా పనిచేసిన జాఫ్రీ తొలిసారిగా 2010లో స్థానిక సంస్థల కోటాలో హైదరాబాద్‌ నుంచి ఎంఐఎం తరఫున శాసనమండలిలో అడుగు పెట్టారు. ఆ తర్వాత రెండుసార్లు..2011, 2017లో మండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది మే 1న ఎమ్మెల్సీగా ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న ఆయన వరుసగా నాలుగోసారి ఇదే కోటాలో పోటీ చేసేందుకు ఎంఐఎం అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

హైదరాబాద్‌ స్థానిక ఓటర్లు 117 
హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల కోటాలో మొత్తం 127 మంది ఓటర్లు (పాత ఎంసీహెచ్‌ పరిధి) ఉండగా, ఇందులో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డులో 8 మంది సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గుడిమల్కాపూర్‌ బీజేపీ కార్పొరేటర్‌ దేవర కరుణాకర్‌ ఈ ఏడాది జనవరిలో మరణించడంతో ఓటర్ల సంఖ్య 118గా ఎన్నికల సంఘం నిర్ధారించింది. అయితే ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఉన్న సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న రెండురోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో ఓటర్ల సంఖ్య 117కు చేరింది.

ఇందులో 83 మంది జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు కాగా దివంగత ఎమ్మెల్యే సాయన్నను మినహాయిస్తే మరో 34 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు ఉన్నారు. వీరిలో లోక్‌సభ సభ్యులు అసదుద్దీన్‌ ఒవైసీ (హైదరాబాద్‌), జి.కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్‌)తో పాటు ఐదుగురు రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, దామోదర్‌రావు, సురేశ్ రెడ్డి, సంతోష్‌కుమార్, బండి పార్థసారధి రెడ్డి, మరో 12 మంది ఎమ్మెల్సీలు, 15 మంది ఎమ్మెల్యేలు (నామినేటెడ్‌ ఎమ్మెల్యేను కూడా కలుపుకొని) శాసనమండలి హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎన్నికలో ఓటు  హక్కును కలిగి ఉన్నారు. 117 మంది ఓటర్లలో బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలకు 94 మంది 
ఓటర్ల బలం ఉంది.  

బీజేపీ సంఖ్యా బలం 23  
బీజేపీకి ఎక్స్‌ అఫీషియో సభ్యులు కిషన్‌రెడ్డి (ఎంపీ), రాజాసింగ్‌ (ఎమ్మెల్యే) ఓట్లు కలుపు­కుని హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటాలో 23 మంది సభ్యుల బలాన్ని కలిగి ఉంది. అయితే ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరడం, జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌ డి.వెంకటేశ్, అడిక్‌మెట్‌ కార్పొరేటర్‌ సునీత ప్రకాశ్‌గౌడ్‌ బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆయా పార్టీల వాస్తవ బలాబలాల్లో కొంత మార్పు ఉండే అవకాశముంది. ఇదిలా ఉంటే బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలకు భారీగా ఓటర్లు ఉండటంతో హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీ దూరంగా ఉంటే జాఫ్రీ వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశముంది.   

>
మరిన్ని వార్తలు