ఒక్క కేసులోనూ విచారణ ఆపాలని కోరలేదు

4 Dec, 2021 01:58 IST|Sakshi

సీఎంగా విధి నిర్వహణలో భాగంగానే హాజరు మినహాయింపు కోరారు

హైకోర్టులో జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వాదనలు

సాక్షి, హైదరాబాద్‌: తన కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో.. ఒక్కదానిలోనూ ప్రత్యేక కోర్టులో విచారణ ఆపాలని కోరుతూ జగన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయలేదని ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి నివేదించారు. ప్రత్యేక కోర్టులో కేసు విచారణ వాయిదా వేయాలని కూడా ఏ రోజూ కోరలేదని తెలిపారు. ముఖ్యమంత్రిగా విధి నిర్వహణలో భాగంగా సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకాలేకపోతున్నానని, తన తరఫున న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలన్న అభ్యర్థనను సీబీఐ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్‌ చేస్తూ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ శుక్రవారం విచారించారు.

‘2012 నుంచి 2019 లో ముఖ్యమంత్రి అయ్యే వరకూ జగన్‌ దాదాపుగా ప్రతి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో అనేక మంది నిందితులు డిశ్చార్జ్‌ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. వాటి పిటిషన్లను ప్రత్యేక కోర్టు రోజువారీ పద్ధతిలో విచారిస్తోంది. ప్రత్యేక కోర్టు విచారణలో జాప్యం జరిగిందన్న సీబీఐ వాదనలో నిజం లేదు. తరచుగా న్యాయమూర్తుల బదిలీలతో డిశ్చార్జ్‌ పిటిషన్లలో వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగా ఈడీ అభియోగప్రతాలను దాఖలు చేసింది. సీబీఐ కేసుల విచారణ పూర్తయ్యే వరకూ ఈడీ కేసుల విచారణ ప్రారంభించడానికి వీల్లేదు. అయితే తాము దాఖలు చేసిన అభియోగపత్రాలను ముందుగా విచారించాలని ఈడీ కోరగా అందుకు ప్రత్యేక కోర్టు అనుమతించింది.

ఈడీ, సీబీఐ కేసులను ప్రత్యేక కోర్టు సమాంతరంగా రోజువారీ పద్ధతిలో విచారిస్తోంది. ప్రజాప్రయోజనాల కోసం, ముఖ్యమంత్రిగా పాలన యంత్రాంగాన్ని పర్యవేక్షించాల్సి ఉన్నందున వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరుతున్నారు. ప్రతి విచారణకు నిందితుని హాజరు తప్పనిసరికాదని అనేక కోర్టుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చింది. ఇదే కేసులోనూ ఇద్దరు నిందితుల హాజరుకు ప్రత్యేక కోర్టు మినహాయింపు ఇవ్వగా మరో నిందితుని వ్యక్తిగత హాజరుకు సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో జగన్‌ హాజరుకు మినహాయింపు ఇవ్వండి’అని నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లపై సీబీఐ వాదనల కోసం తదుపరి విచారణను న్యాయమూర్తి ఈనెల 6కు వాయిదా వేశారు.  

ఆయన్ను చూసి సాక్షి నోరు విప్పలేరేమో 
‘పోక్సోలాంటి కొన్ని కేసుల్లో నిందితులు హాజరుకాకపోవడమే సాక్ష్యులకు మంచిది. ఈ కేసులోనూ ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ హాజరైతే ఆయన ముందు సాక్ష్యులు నోరు విప్పడానికి కూడా సంశయించే అవకాశం ఉంది. కొన్ని కేసుల్లో నిందితులు వ్యక్తిగతంగా హాజరుకాకపోవడమే కోర్టు విచారణకు, స్వేచ్ఛగా సాక్ష్యులు వాంగ్మూలం ఇచ్చేందుకు మంచిది. కోర్టుకు సీఎం హాజరైతే సెక్యూరిటీ ఇతర ఏర్పాట్లలో ఇతర కక్షదారులకు తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం ఉంది’అని న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌ పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు