జగన్నాథుడి భూమి గుట్టు అధికారులకే ఎరుక!

12 Sep, 2020 11:15 IST|Sakshi
జగన్నాథ ఆలయానికి సంబంధించిన భూమి గోదావరితీరా హనుమాన్‌ పేరున మారిన పత్రం

సాక్షి, చెన్నూర్‌: జగతి మెచ్చిన దేవుడు.. కొరికేలు తీర్చే కల్పతరువు.. ఆపద్బంధువైన జగన్నాథుడి భూమిని కొందరు అప్పనంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోపక్క రికార్డుల్లోనూ స్వామిపేరున ఉన్న భూమి శ్రీరామబంటుగా పేరుగాంచిన హనుమంతుడి పేరిట మారడం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. చెన్నూర్‌లోని జగన్నాథాలయం పేరున ఉన్న భూమి రికార్డుల్లో మాత్రం ఇదే పట్టణంలోని గోదావరితీరా హనుమాన్‌ పేరిట మారడంలో అధికారుల తప్పిదమా..? లేక ఇందులో ఏదైనా మతలబు ఉందా..? అని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. దేవుడి భూమికే ఎసరు పెట్టాలని చూస్తున్నారని ఆల య కమిటీ మాజీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

ఆ భూమి ఎలా వచ్చింది..?
పట్టణంలో జగన్నాథాలయానికి ఓ చరిత్రే ఉంది. అలాంటి పూర్వకాలపు ఆలయానికి స్థానికంగా కొంత మాన్యాలు ఉండాలనే ఉద్దేశంతో అప్పటి రెవెన్యూ అధికారులు పట్టణ శివా రులోని 869/21 సర్వేనంబర్‌లోగల ప్రభుత్వ భూమి నాలు గెకరాలను 1972లో కేటాయించారు. ఆ భూమిని అప్పటి జగన్నాథాలయ ట్రస్ట్‌ చైర్మన్‌గా ఉన్న వానమామలై వరదాచార్యులకు ఆయన పేరిట పట్టా చేసి అప్పగించారు. వరదాచార్యులు చనిపోయిన అనంతరం ఆయన సతీమణి వైదే హి పేరిట మారింది. అయితే ఆ భూమి మీదుగా జాతీయ ర హదారి నిర్మాణం కావడంతో సుమారు 20 గుంటల భూమి కోల్పోయింది.

మిగిలిన 3.20 ఎకరాల భూమికి హక్కు పత్రాలను రెవెన్యూ అధికారులు అప్పుడే వైదేహికి అందించారు. ఆమె మరణానంతరం కుమారుడు రవీంద్రచారి పేరిటకు మారగా.. ఆయన గిఫ్ట్‌డీడ్‌ పేరుతో 2014లో జగన్నాథాలయం పేరిట భూమిని మార్పించారు. సుమారు 48 ఏళ్లుగా జగన్నాథాలయం పేరుతో భూమి ఉన్నట్లు గతేడాది అప్పటి తహసీల్దార్‌ 1–బీ సైతం అందించారు. తాజాగా సదరు భూమికి సంబంధించిన రికార్డును పరిశీలిస్తే గోదావరితీరా హనుమాన్‌ మందిర్‌ పేరిట మారినట్లు చూపిస్తోంది. ఈ అంశంలో అసలు రికార్డుల్లో పొరపాటు జరిగిందా..? ఎవరైన కావాలనే పేరు మార్పించారా..? అనే కోణంలో అధికారులు సమగ్ర విచారణ జరిపి జగన్నాథాలయం భూమిని ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులకు అప్పగించాలని కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు. 

రెవెన్యూ లీలాలు..
జగన్నాథాలయం భూమి రికార్డులను పరిశీలిస్తే రెవెన్యూ అ ధికారుల లీలలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది రికార్డు ప్ర కారం 869/21 సర్వే నంబర్‌లో 3.20 ఎకరాల భూమి ఆల యం పేరిటే ఉంది. ప్రస్తుత రికార్డు ప్రకారం గోదావరి తీరా హనుమాన్‌ పేరున ఉంది. ఏడాది కాలంలోనే ఆలయం పే రు మారడంలోని ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఎవరి హస్తం ఉందో..? జగన్నాథాలయం పేరిట ఉన్న భూమిని హనుమాన్‌ ఆలయం పేరిట మార్చాలని ఎవరు ఫిర్యాదు చేశారో అంతుచిక్కడం లేదు. ఏదేమైనా.. దేవుడిమాన్యాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే రికార్డులు మారిస్తే ఎవరికి చెప్పేదని పలువురు పేర్కొంటున్నారు.

ఆలయానికి ఇస్తే మంచిదే..
జగన్నాథాలయానికి కేటాయించిన భూమిని కాపాడాలి. గతంలో కొంతభూమిని అధికారులు చూపించారు. అక్కడ బోర్డులు వేశాం. ప్రస్తుతం ఆ బోర్డులు సైతం లేకుండాపోయాయి. రికార్డులు పరిశీలించి అధికారులు భూమిని ఆలయానికి ఇస్తే మంచిదే.  – దామెర మోహనాచార్యులు, జగన్నాథాలయ వంశపారంపర్య అర్చకులు, చెన్నూర్‌

మరిన్ని వార్తలు