నేరాలు, ఘోరాల రాష్ట్రంగా తెలంగాణ

19 Apr, 2022 02:14 IST|Sakshi

ఖమ్మం, రామాయంపేట ఘటనలే నిదర్శనం: జగ్గారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ నేరాలు, ఘోరాల రాష్ట్రంగా మారిపోయిందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి విమర్శించారు. సినిమాల్లో చూపినట్లుగా రాష్ట్రం లో ప్రస్తుతం నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయన్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌ వేధింపులకు తాళలేక బీజేపీ కార్యకర్త సాయిగణేశ్‌ ఆత్మహత్య, అధికార పార్టీ నేతల వేధింపులు భరించలేక రామాయంపేటకు చెందిన తల్లీకొడుకులు ఆత్మాహుతికి పాల్పడటం ఇందుకు నిదర్శనమన్నారు.

సోమవారం గాంధీ భవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మౌనంతో ప్రభుత్వమే ఇప్పుడు దోషిగా నిలబడాల్సి వచ్చిందన్న విషయాన్ని గ్రహించాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, పోలీసులు రాక్షసులుగా మారుతున్నారని ఆరోపించారు. మంత్రి అజయ్‌ కుమార్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయడంతోపాటు బీజేపీ కార్యకర్త ఆత్మహత్యకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. అలాగే రామాయంపేట ఘటనకు బాధ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్‌ఎస్‌ నేతలను అరెస్టు చేయాలన్నారు.

మరిన్ని వార్తలు