మిత్రుడికి సాయం చేయబోయి ప్రాణాలు కోల్పోయారు

16 Oct, 2020 12:24 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రొంపిచర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో జగిత్యాల జిల్లా ధర్మపురి లో విషాదం అలుముకుంది. రొంపిచర్ల వద్ద ఒక కారు కాలువలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అందులో ముగ్గురు ధర్మపురికి చెందిన వారే కావడంతో ధర్మపురి లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో ధర్మపురికి చెందిన కటకం మహేష్, అతని బావమరిది రాయపట్నంకు చెందిన ఆనంద్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీరు గౌడ్, అతని కుమారుడు శివ బాలాజీ ఉన్నారు. ఆంధ్రకు చెందిన మేస్త్రీ మాధవ్ తన స్వగ్రామమైన ప్రకాశం జిల్లా రఘునాథపురంలో ఉన్న ఇంటికి పెయింటింగ్ వేసేందుకు మిత్రుడి కారులో నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరాడు.

కారులో మాధవ్‌తో పాటు మహేష్‌, ఆనంద్‌, బీరుగౌడ్‌, శివబాలజీ కూడా ఉన్నారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత రొంపిచర్ల సమీపంలో మూలమలుపు వద్ద కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న మాధవ్ తప్పించుకొని సమీపంలోని పెట్రోల్ బంక్‌ వద్దకు వెళ్లి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కారు తో సహా నలుగురు మృతదేహాలు వెలికితీశారు. ప్రమాద విషయం తెలియడంతో ధర్మపురిలోని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గత 15 ఏళ్లుగా ధర్మపురి లో ఉంటున్న బీరు గౌడ్ స్థానికంగా పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. లాక్ డౌన్ ముందు భార్యతో పాటు కుటుంబ సభ్యులంతా యూపీకి  వెళ్లడంతో బీరు గౌడ్ అతని కుమారుడు మాత్రమే ఇక్కడ ఉన్నారు. మేస్త్రి మాధవ్‌కు వీరంతా మంచి మిత్రులు కావడంతో అతని సొంత ఇంటికి కలర్ వేసేందుకు ధర్మపురిలోకలర్ మిక్సింగ్ చేసి తీసుకెళ్తుండగా ప్రమాదానికి గురై నలుగురు ప్రాణాలు కోల్పొయారు. ఇంతమంది ఓకేసారి ప్రాణాలు కోల్పొవడంతో స్థానికంగా ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. 

చదవండి: విషాదం: ఇద్దరు పిల్లలతో చెరువులో దూకిన తల్లి

మరిన్ని వార్తలు