తెలంగాణ రైతుల సమస్యలు పరిష్కరించండి 

23 Sep, 2022 02:47 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న రైతు సంఘం నేతలు. చిత్రంలో అర్వింద్‌ 

కేంద్ర మంత్రి తోమర్‌కు జగిత్యాల రైతు బృందం వినతి

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపాల ని జగిత్యాల రైతుల బృందం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌కు విజ్ఞప్తి చేసింది. తమ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ వచ్చిన రైతుల బృందం గురువారం బీజేపీ ఎంపీ అర్వింద్‌ నేతృత్వంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్, సహాయమంత్రి కైలాశ్‌ చౌదరిలను కలసి అనేక అంశాలపై చర్చించింది.

అనంతరం అర్వింద్‌ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతుల బృందానికి అధ్యక్షత వహించిన పన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. పసుపు పంటకు మద్దతు ధర, చెరకు పంట పునరుద్ధరణ, మామిడి మార్కెట్‌ అభివృద్ధి, మిర్చి మార్కెట్‌ ఏర్పాటు, వాలంతరి ప్రదర్శన క్షేత్రం అభివృద్ధి, ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం, రుణాల పరిమితిని రూ.3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాల్సిందిగా కేంద్రాన్ని కోరామన్నారు.

పసుపు పంటకు మద్దతు ధర కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వస్తే గతంలో మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీమ్‌ కింద కేంద్ర వాటాగా ఉన్న 30 శాతాన్ని రైతులకు మేలు చేయడానికి 50 శాతం భరించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు కేంద్రమంత్రి తోమర్‌ హామీ ఇచ్చారని తెలిపారు. వచ్చే నెల 10న జగిత్యాలలో జరగనున్న రైతు సభలో కేంద్రమంత్రి కైలాశ్‌ చౌదరి సమక్షంలో పెద్ద ఎత్తున రైతులతో కలసి బీజేపీలో చేరనున్నట్లు ఆయన వెల్లడించారు. అంతకుముందు ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఇథనాల్‌ ప్లాంట్స్‌ పెట్టడంలేదని..ప్రైవేట్‌ వారిని కూడా పెట్టనివ్వడం లేదని విమర్శించారు.

మరిన్ని వార్తలు