16 ఏళ్ల నిర్లక్ష్యం.. పోయిన ప్రాణం

18 Jun, 2021 10:23 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: జిల్లా వెల్గటూరు మండలం పాత గూడూరు గ్రామానికి చెందిన మల్లవేని రాజు (35) గ్రామంలో ఓ వ్యక్తి వద్ద ట్రాక్టరు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య స్వప్న, కూతురు అవిఘ్నయ(2) ఉన్నారు. ఈ నెల 13న విధుల్లో భాగంగా గ్రామానికి చెందిన ఓ కౌలు రైతు వ్యవసాయ భూమిలో పనికి వెళ్లాడు. అయితే ఆ పొలం వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి స్తంభానికి విద్యుత్‌ లైన్‌ ఉంది. ఎన్నో ఏళ్లుగా తీగలు వేలాడుతూ ఉండడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా వారు పట్టించు కోలేదు. దీంతో భూమి యజమాని తాత్కాలికంగా కర్రను సపోర్టుగా పాతాడు.

పొలంలో రాజు ట్రాక్టరుతో పని చేస్తుండగా.. వేగంగా వీచిన గాలులకు కర్ర కింద పడిపోవడంతో ట్రాక్టరుకు తగిలిన తీగలు రాజుకు చుట్టుకుపోయాయి. దీంతో తీవ్ర విద్యుత్‌షాక్‌కు గురైన రాజు అక్కడికక్కడే చనిపోయాడు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతోనే తన భర్త చనిపోయాడని రాజు భార్య స్వప్న ఆరోపిస్తోంది. 16 ఏళ్ల నుంచి ఆ సమస్య ఉందని రాజు సోదరుడు లక్ష్మణ్‌ చెప్పాడు. ఇదే ప్రాంతంలో 16 ఏళ్ల క్రితం వేలాడుతున్న విద్యుత్‌ తీగలు తగిలి నాలుగు గేదెలు చనిపోయినా విద్యుత్‌ సిబ్బంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సమస్యను పట్టించుకోలేదు.  

చదవండి: మూగజీవాలపై యమపాశం

మరిన్ని వార్తలు