జైలు నుంచి విడిపించరూ..! 

29 Mar, 2021 20:03 IST|Sakshi
విడుదల చేయించాలని వేడుకుంటున్న కుటుంబ సభ్యులు (ఇన్‌సెట్లో) శ్రీనివాస్‌

లెబనాన్‌ వెళ్లి తిరిగి వస్తుండగా కార్మికుడు శ్రీనివాస్‌ అరెస్టు

ఇక్కడికి వచ్చేలా చూడాలని వేడుకుంటున్న కుటుంబసభ్యులు 

పెగడపల్లి (ధర్మపురి): జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని మ్యాక వెంకయ్యపల్లికి చెందిన లింగంపల్లి శ్రీనివాస్‌(27) ఉపాధి కోసం లెబనాన్‌ వెళ్లి తిరిగి వస్తుండగా షార్జా విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనివాస్‌ 2013లో కంపెనీ వీసాపై దుబాయి వెళ్లి 2016 వరకు పనిచేశాడు. అక్కడి కంపెనీలో పని సక్రమంగా లేకపోవడం, జీతం తక్కువగా ఉండటంతో తిరిగి రావాలని భావించాడు. అయితే అప్పటికే వీసా గడువు సమయం ముగియడంతో శ్రీనివాస్‌పై అక్కడి ప్రభుత్వం కేసుపెట్టి అరెస్టు చేసింది. 15 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలై భారత్‌కు వచ్చాడు. 2018లో తిరిగి కంపెనీ వీసాతో లెబనాన్‌ వెళ్లాడు.

తాజాగా లెబనాన్‌ నుంచి తిరిగొచ్చేందుకు ఈ నెల 25న బయల్దేరి షార్జాకు చేరుకున్నాడు.  విమానాశ్రయంలో శ్రీనివాస్‌ పాసుపోర్టు స్కాన్‌ చేస్తుండగా దుబాయిలో కేసు ఉన్నట్లు తేలి, పాసుపోర్టు ఎర్రర్‌ చూపింది. దీంతో పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్టుచేసి జైలుకు పంపారు. కాగా,  రెండు రోజుల కింద లెబనాన్‌ నుంచి బయల్దేరుతూ తమకు ఫోన్‌ చేసి ఇంటికి వస్తున్నానని చెప్పాడని తల్లిదండ్రులు బాలయ్య, కొమురమ్మ, భార్య మమత రోదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్కడి రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి, తమ కొడుకు ఇక్కడికి వచ్చేలా చూడాలని కోరుతున్నారు.

హృదయవిదారకం.. రోడ్డుపక్క గర్భిణి ప్రసవం 

మరిన్ని వార్తలు