దొరగారూ.. మీకో దండం!

26 Jan, 2023 10:28 IST|Sakshi

కన్నీటి పర్యంతమవుతూ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన

బీసీ మహిళనన్న చిన్నచూపుతో అడుగడుగునా వేధించారు..

ఎమ్మెల్యేతో ఆపద పొంచి ఉంది.. మాకేదైనా జరిగితే ఆయనే కారణం

సాక్షి, కరీంనగర్‌: ‘దొరగారూ మీకో దండం. మూడేళ్లుగా అడుగడుగునా అవమానాలు, వేధింపులు భరించా. ఇక నా వల్ల కాదు, మీ గడీ సంకెళ్లు తెంపుకుని బయటికి వస్తున్నా..నా కుటుంబాన్ని, పిల్లల్ని కాపాడుకునేందుకే రాజీనామా చేస్తున్నా. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఆశీస్సులతో మూడేళ్ల పాటు పదవిలో కొనసాగాను. ఇక ఈ నరకం నా వల్ల కాదు. దొరా మీరే గెలిచారు..’ అంటూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ను ఉద్దేశించి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భోగ శ్రావణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్నీటి పర్యంతమవుతూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బు ధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఉద్వేగంగా మాట్లాడారు. 

ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి..    
‘ఒక మహిళా బీసీ నేతగా జగిత్యాల ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మూడు నెలల పసిగుడ్డును వదిలి రాజకీయాల్లోకి వచ్చాను. కేటీఆర్, కవిత ఆశీస్సులతో బలహీనవర్గాలకు చెందిన నేను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి పొందగలిగా. కానీ ప్రమాణ స్వీకారం చేసిన రెండోరోజు నుంచే విషం చిమ్మే కోరలు ఉన్న మనుషుల మధ్య పనిచేయాల్సి వచ్చింది. ‘మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి అంటే ముళ్లకిరీటం’ అని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ చెబితే తన తండ్రిలాంటి వాడు, తన బాగు కోసం సలహాలు ఇస్తున్నాడని భావించానే తప్ప.. ఆయన రాక్షసత్వానికే బలవుతానని అనుకోలేదు..’ అని శ్రావణి అన్నారు.

పేరుకే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ని..
‘కరీంనగర్‌ రోడ్లో ఏర్పాటు చేసిన డివైడర్లు ఎందుకు చిన్నగా ఉన్నాయని ప్రశ్నిస్తే.. కాంట్రాక్టర్, కౌన్సిలర్ల ముందే అవమానించారు. పార్కులు అభివృద్ధి చేయాలని కోరితే అమరవీరుల స్తూపం సాక్షిగా తీవ్రంగా అవమానించారు. మున్సిపాలిటీ లో ఎలాంటి పర్యటనలు చేయకూడదు. కనీసం రూ.10 వేల విలువ గల పనికి కూడా కొబ్బరికాయ కొట్టలేని దయనీయస్థితి. పేరుకే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ని. పెత్తనం ఎమ్మెల్యేదే..’ అని చెప్పారు.

చైర్‌పర్సన్‌ పదవిని అమ్ముకోవడానికి బేరం
‘నాలుగేళ్లలోపు అవిశ్వాసాలు పెట్టరాదని తెలిసినా ఎమ్మెల్యే కౌన్సిలర్లను బెదిరించి అవిశ్వాస తీర్మానం డ్రామా ఆడారు. చైర్‌పర్సన్‌ పదవిని అమ్ముకోవడా నికి ఓ మహిళా కౌన్సిలర్‌ భర్తతో బేరం కుదుర్చుకు న్నారు. కర్కశత్వం, మూర్ఖత్వం, క్రూరత్వం కలిపితే ఎమ్మెల్యే సంజయ్‌. ఆయనతో మాకు ఆపద పొంచి ఉంది.  మా కుటుంబానికి ఏమైనా జరిగితే ఎమ్మె ల్యేనే కారణం. మాకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎస్పీగారిదే’ అని శ్రావణి తెలిపారు. 

శ్రావణికి బీఫామ్‌ ఇచ్చిందే నేను
చైర్‌పర్సన్‌ భోగ శ్రావణి ఆరోపణలు సమంజసం కాదు. ఆమెకు బీఫామ్‌ ఇచ్చిందే నేను. అలాంటిది నేను ఎందుకు ఆమెకు వ్యతిరేకంగా వ్యవహరిస్తాను. అవిశ్వాసం విషయంలో నా ప్రమేయం లేదు. ఈ విషయంలో ఇంతకుమించి స్పందించలేను.
– ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

మరిన్ని వార్తలు