నేను బతికేలా లేను.. బిడ్డలు, నువ్వు జాగ్రత్త!

31 May, 2021 08:46 IST|Sakshi

హైదరాబాద్‌ ఆసుపత్రి అంటేనే భయమేస్తుంది

అందరికీ ధైర్యం చెప్పి తానే ధైర్యం కోల్పోయిన ఉపాధ్యాయుడు

లక్షలు ఖర్చు పెట్టిన బతకలేదు

ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుటుంబం దీనగాథ

సాక్షి, గొల్లపల్లి(ధర్మపురి):  కరోనా అంటే భయపడవద్దని.. ఇంటి వద్దనే తగ్గుతుందని అందరిలో ధైర్యం నూరిపోసిన తానే ధైర్యం కోల్పోయాడు. ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చేరేందుకు వెనుకాడాడు. చివరికి శ్వాససంబంధిత సమస్య తలెత్తడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేరి ప్రాణాలు కోల్పోయాడు. ‘నువ్వు.. బిడ్డలు జాగ్రత్త..’ అంటూ ఆస్పత్రిలో చేరే ముందు చెప్పినవే చివరిమాటలు అయ్యాయి. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బండారి చంద్రశేఖర్‌ కరోనా కాటుకు బలయ్యాడు.

చంద్రశేఖర్‌ బుగ్గారం మండలం గంగాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్నారు. భార్య లహరి, కొడుకు చరణ్‌తేజ(14), కూతురు కీర్తి(11) ఉన్నారు. చంద్రశేఖర్‌ చిన్న వయస్సులో ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడమే కాదు.. మారుమూల ప్రాంతంలోని పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషిచేశారు. గ్రామంలో ఎవరికీ ఇబ్బంది ఎదురైన తనకు తోచిన సహాయం అందించేవారు. ఇలా అందరికీ సాయం చేసే శేఖర్‌ ఈ నెల 19న కరోనాతో పోరాడి ప్రాణాలు వదిలాడు. 

ఇంటి వద్దే తగ్గుతుందనుకున్నారు
కరోనా పాజిటివ్‌ అని తెలిసినా భయపడలేదు. హోమ్‌ క్వారంటైన్‌లో ఉండి మందులు వాడితే తగ్గిపోతుందని భావించాడు. శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో హైదరాబాద్‌ తీసుకెళ్తామన్నాం. హైదరాబాద్‌ ఆసుపత్రిలో ఎక్కువ మంది లక్షలు ఖర్చు చేసుకున్నా తగ్గుతలేదని, ఇంటి వద్దనే మందులు వాడితే తగ్గిపోతుందని మాకు చెప్పాడు. అయితే ఐదు రోజులకే ఆరోగ్యంలో మార్పులు కనిపించాయి. వెంటనే హైదరాబాద్‌కు తీసుకెళ్లాం. ఆసుపత్రిలోకి వెళ్లే సమయంలో బిడ్డలు.. నువ్వు జాగ్రత్త అన్న మాటలే చివరి మాటలు అవుతాయని అనుకోలేదు. ఆయన బతికిరావాలని మొక్కరాని దేవుళ్లకు మొక్కినం. రూ.8 లక్షల వరకు ఖర్చు చేసినా ప్రాణం దక్కలేదు. నాన్న వస్తాడమ్మ.. నాన్నకు ఏమికాదని నా పిల్లలు అంటుంటే దుఃఖం ఆగడం లేదు.  
– లహరి, శేఖర్‌ భార

ఇప్పుడెవరిస్తారు నాన్న
మా నాన్న అడుగక ముందే అన్ని ఇచ్చారు. నాన్న చనిపోయి 11 రోజులవుతుంది. బయటకు వెళ్తే ఏదో ఒకటి తీసుకొచ్చి ఇచ్చేది. ఇప్పుడెవరిస్తారు నాన్న?. ప్రైవేట్‌ స్కూల్‌లో నన్ను, చెల్లిని చదవించావు. నేను బాగా క్లెవర్‌ అని కలెక్టర్‌ అయ్యే దాకా చదివిస్తాను అన్నావు. కానీ కలెక్టర్‌ను చేయకుండానే వెళ్లిపోయావు. నాకు బైక్‌ నేర్పించావు. నువ్వు లేకుండా బైక్‌ నడుపబుద్ది కావడం లేదు నాన్న. చెల్లి కీర్తి సారీ ఫంక్షన్‌ గ్రాండ్‌గా చేస్తానన్నావు. ఇప్పుడు కనిపించనంత దూరంగా వెళ్లిపోయిండు. మా నాన్న మళ్లీ రావాలి.  
 – చరణ్‌తేజ్, కీర్తి  

చదవండి: 
బ్లాక్​ఫంగస్ దానివల్ల రాదు​.. ఇది అసలు విషయం!

దమ్ము కొడితే.. దుమ్ములోకే..

మరిన్ని వార్తలు