బీజేపీకి బీసీ ఓట్లు అవసరం లేదా?: జాజుల 

26 Sep, 2021 01:57 IST|Sakshi

కవాడిగూడ (హైదరాబాద్‌): బీసీల లెక్కలు తీస్తేనే బీజేపీకి బీసీలు ఓట్లు వేస్తారని లేకుంటే బీజేపీని బీసీలు బంగాళాఖాతంలో కలపడం ఖాయమని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మండిపడ్డారు. జనాభా లెక్కల్లో బీసీ జనగణనను నిర్వహించేది లేదని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టు అఫిడవిట్‌ దాఖలు చేయడాన్ని దేశంలోని 60 కోట్ల మంది బీసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. శనివారం దోమలగూడలోని బీసీ సంక్షేమ భవన్‌లో ఏర్పాటు చేసిన బీసీ సంఘాల సమావేశంలో జాజుల మాట్లాడుతూ బీసీ జనాభా లెక్కలు తీస్తామని గతంలో చెప్పిన బీజేపీ ప్రభుత్వం నేడు మాట మార్చడం అంటే బీసీలను దగా చేయడమేనని ఆరోపించారు.

2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని జనాభా లెక్కలు సేకరించాలని బీజేపీ పార్లమెంట్‌లో డిమాండ్‌ చేసిందని గుర్తుచేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ జనాభా లెక్కలు తీస్తామని ప్రకటించారన్నారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, సంఘం కార్యదర్శి జాజుల లింగం, యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్, విద్యార్థి సంఘం నాయకులు మహేశ్, చంద్రశేఖర్‌గౌడ్, రాజేందర్, సాయితేజ్, అరవింద్, రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు