కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు రూ. లక్ష కోట్లు కేటాయించాలి

28 Jan, 2023 02:10 IST|Sakshi
మాట్లాడుతున్న జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ 

సుందరయ్య విజ్ఞాన కేంద్రం: కేంద్ర బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ. లక్ష కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. బీసీలకు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలని కోరుతూ ప్రధాన మంత్రికి మెయిల్‌ ద్వారా లేఖను పంపినట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కులో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ... బీసీలకు ప్రత్యేక మంతృత్వ శాఖ లేకపోవడం బాధాకరమన్నారు.

2021–22 బడ్జెట్‌ మొత్తం రూ. 39 లక్షల కోట్లు ఉండగా బీసీలకు కేవలం రూ. 2015 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల వ్యతిరేక వైఖరిని మార్చుకోకపోతే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా బీసీ గురుకుల పాఠశాలలతో పాటు ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర కేంద్ర విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్‌ కుందారం గణేష్‌చారి, బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు విక్రమ్‌గౌడ్, యువజన సంఘం అధ్యక్షుడు కనకాల శ్యామ్‌కురుమ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరి రవికృష్ణ, రాష్ట్ర నాయకుడు రాపర్తి సంతోష్‌గౌడ్, రాష్ట్ర కార్యదర్శి రాజేష్‌ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు