3 నెలలుగా పింఛన్‌ లేదు.. బతికుండగానే చంపేశారు!

6 Aug, 2021 10:30 IST|Sakshi
వికలాంగుడు బాల్‌నర్సయ్య, బాధితుడి ఆధార్‌ కార్డు

మెప్మా సిబ్బంది నిర్వాకంతో దివ్యాంగుడికి ఆగిన పింఛన్‌

సాక్షి. జనగామ: అతనో దివ్యాంగుడు. ప్రభుత్వం నుంచి ప్రతినెలా రూ. 3,016 పింఛన్‌ తీసుకుంటున్నాడు. అయితే గత ఏప్రిల్‌ నుంచి ఆయనకు పింఛన్‌ రావడం లేదు. దీంతో ఈనెల 4న మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చి మెప్మా పీడీ హర్షవర్ధన్‌ను నిలదీశాడు. తన పేరును చనిపోయిన జాబితాలో చేర్చారని అధికారి చెప్పడంతో హతాశుడయ్యాడు.

జనగామ జిల్లా కేంద్రంలోని 25వ వార్డు కృష్ణాకళామందిర్‌ ఏరియాకు చెందిన దివ్యాంగుడు కానుగ బాల్‌నర్సయ్య సర్వే సమయంలో ఇంటి దగ్గర లేకపోవడంతో, మెప్మా సిబ్బంది డోర్‌లాక్‌ అని రాసుకుని, ఆ తరువాత విచారణ చేపట్టకుండానే ఆయన పేరును చనిపోయిన జాబితాలోకి ఎక్కించారు.

కాగా, ఈ విషయాన్ని బహిర్గతం చేయవద్దని బాల్‌నర్సయ్యను పీడీ హర్షవర్ధన్‌ కోరినట్టు తెలిసింది.దీనిపై పీడీ హర్షవర్ధన్‌ను వివరణ కోరగా, ఇంటింటి సర్వేలో డోర్‌లాక్‌ ఉండడంతోనే బాల్‌నర్సయ్య చనిపోయినట్లుగా తమ సిబ్బంది నమోదు చేసుకున్నారని చెప్పారు. ఆర్‌పీకి మెమో ఇచ్చి ఘటనపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు