నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు

15 Oct, 2021 02:43 IST|Sakshi

ఈ ర్యాంకుల ఆధారంగానే 23 ఐఐటీలు సహా 114 విద్యా సంస్థల్లో ప్రవేశాలు 

మొత్తం అందుబాటులో 50 వేల సీట్లు 

16 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. జేఈఈ మెయిన్స్‌ ర్యాంకులు గత నెల 15వ తేదీన ప్రకటించారు. ఇందులో అర్హత సాధించిన వారు అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాశారు. జాతీయ స్థాయిలో 23 ఐఐటీలు, 32 జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీలు (ఎన్‌ఐటీలు), 26 ట్రిపుల్‌ ఐటీ కాలేజీలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటుతో నడిచే మరో 33 విద్యా సంస్థల్లో దాదాపు 50 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.

కాగా దసరా రోజున వెలువడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకుల ఆధారంగానే ఈ సీట్లను భర్తీ చేస్తారు. దీని కోసం ఈ నెల 16వ తేదీ నుంచి జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ ఆథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించనుంది. అర్హత సాధించిన విద్యార్థులు అదే రోజు కౌన్సెలింగ్‌ కోసం పేరు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈ నెల 22, 24 తేదీల్లో జోసా మాక్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. తాము సాధించిన ర్యాంకుల ఆధారంగా ఎక్కడ సీటు వస్తుందో విద్యార్థులు తెలుసుకునేందుకు దీనిద్వారా వీలుంటుంది. ఇది ముగిసిన తర్వాత అధికారికంగా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.

ఈ నెల 25 వరకు వెబ్‌ ఆప్షన్లలో ఎన్నిసార్లయినా మార్పులు చేసుకోవచ్చు. 25వ తేదీ అర్ధరాత్రి తర్వాత దీని గడువు ముగుస్తుంది. 27న ఉదయం 10 గంటలకు తొలి రౌండ్‌ సీట్లు కేటాయిస్తారు. సీట్లు వచ్చిన అభ్యర్థులు ఈ నెల 30 నాటికి సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నవంబర్‌ 1న రెండో విడత, 6న మూడో విడత, 10న నాల్గవ విడత, 10న నాల్గవ విడత, 14న ఐదవ విడత, 18న ఆరవ విడత కౌన్సెలింగ్‌ చేపడతారు. ఆఖరి విడతలో సీట్లు దక్కిన వాళ్ళు నవంబర్‌ 20 నాటికి రిపోర్ట్‌ చేయాలి. 

అటో ఇటో తేలిపోతుంది 
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకులు ప్రకటించిన తర్వాత విద్యార్థులకు ఓ స్పష్టత వచ్చే వీలుంది. ఎంసెట్‌లో మంచి ర్యాంకులు పొందినవారు టాప్‌ టెన్‌ కాలేజీల్లో సీట్లు దక్కించుకున్నారు. వీరు జెఈఈ అడ్వాన్స్‌డ్‌లో కూడా మంచి ర్యాంకు సాధించి ఐఐటీ లేదా ఎన్‌ఐటీలో నచ్చిన బ్రాంచ్‌లో సీటు పొందగలిగితే రాష్ట్ర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో వచ్చిన సీటును వదులుకునే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు