ఫిజిక్స్‌ కఠినంగా.. మ్యాథ్స్‌ మధ్యస్తంగా..

28 Sep, 2020 04:42 IST|Sakshi

ముగిసిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష 

వచ్చే నెల 5న ఫలితాల ప్రకటన

6 నుంచి జోసా కౌన్సెలింగ్‌..  

సాక్షి, హైదరాబాద్‌: ఐఐటీల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 15 కేంద్రాల్లో దాదాపు 15 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో భౌతిక శాస్త్రం ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని, సుదీర్ఘ సమాధానాలు కలిగిన ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయని విద్యార్థులతో పాటు సబ్జెక్టు నిపుణులు ఉమాశంకర్, ఎంఎన్‌ రావు వెల్లడించారు. ఇక మ్యాథమెటిక్స్‌లో ఎక్కువ ప్రశ్నలు మధ్యస్తంగా ఉండగా, కొన్ని ప్రశ్నలు మాత్రం కఠినంగా ఉన్నాయని, కెమిస్ట్రీలో మాత్రం సులభమైన ప్రశ్నలు వచ్చినట్లు తెలిపారు.

ఉదయం జరిగిన పేపర్‌–1 పరీక్షలో ఒకే జవాబు కలిగిన ప్రశ్నలు 6, ఒకటి కంటే ఎక్కువ జవాబులు కలిగిన ప్రశ్నలు 6 వచ్చాయని, పూర్ణ సంఖ్య జవాబుగా కలిగిన ప్రశ్నలు మరో 4 ఉన్నట్లు వెల్లడించారు. మధ్యాహ్నం జరిగిన పేపర్‌–2 పరీక్షలోనూ ప్రశ్నల సరళి అలాగే ఉందన్నారు. పేపర్‌–1తో పోల్చితే పేపర్‌–2లో ఫిజిక్స్‌ ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నట్లు వివరించారు. గతేడాది కంటే ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ చాలా కఠినంగా ఉందని పేర్కొన్నారు. ఓపెన్‌ కేటగిరీలో కటాఫ్‌ మార్కులు 35 శాతం, ఓబీసీలో 28–30 శాతం, ఎస్సీ, ఎస్టీల్లో 12–15 శాతం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రెండు పేపర్లలో కలిపి 396 మార్కులకు గాను తెలుగు విద్యార్థులకు 360 మార్కులకు పైగా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. 

5వ తేదీన ఫలితాలు.. 
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలను వచ్చే నెల 5న ఐఐటీ ఢిల్లీ విడుదల చేయనుంది. ఆ తర్వాతి రోజు నుంచే (6వ తేదీ) ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాల కోసం జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ (జోసా) ఉమ్మడి కౌన్సెలింగ్‌ను నిర్వహించనుంది. ఇందుకోసం షెడ్యూల్‌ను కూడా జారీ చేసింది. 6వ తేదీ నుంచి మొదటి విడత ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లను ప్రారంభించి 16వ తేదీన సీట్లను కేటాయించనుంది.

అనంతరం మరో ఐదు దశల కౌన్సెలింగ్‌ నిర్వహించి, నవంబర్‌ 7వ తేదీతో సీట్ల కేటాయింపును పూర్తి చేయనుంది. నవంబర్‌ 9వ తేదీ నాటికి కరోనా పరిస్థితి అదుపులోకి రాకపోతే విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే రిపోర్టింగ్‌ చేసేలా చర్యలు చేపట్టింది. మరోవైపు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌లో ప్రవేశాల కోసం వచ్చే నెల 8వ తేదీన ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టును (ఏఏటీ) నిర్వహించి, 11వ తేదీన వాటి ఫలితాలను ప్రకటించనుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా