నిరుద్యోగులకు అండగా నిలిస్తే అరెస్టులా?

3 Oct, 2021 03:42 IST|Sakshi
మాట్లాడుతున్న జీవన్‌రెడ్డి 

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపాటు

చందుర్తి (వేములవాడ): నిరుద్యోగ యువతకు అండగా నిలిస్తే ప్రభుత్వం అరెస్ట్‌ చేయించడం సిగ్గుచేటు అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. చందుర్తిలో శనివారం గాంధీ విగ్రహ ఆవిష్కరణకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్, పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్‌లతో కలిసి ఆయన హాజరయ్యారు. అనంతరం కాంగ్రెస్‌ చేపట్టిన జంగ్‌ సైరన్‌ కార్యక్రమానికి జీవన్‌రెడ్డి వెళ్తున్నారనే సమాచారంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్‌చేశారు.

దీంతో కార్యకర్తలు పోలీసుల వైఖరికి నిరసనగా వాహనానికి అడ్డుగా బైఠాయించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్‌ ఆధ్వర్యంలో పోలీసులు కార్యకర్తలను అడ్డు తొలగించి జీవన్‌రెడ్డి, ప్రభాకర్‌గౌడ్, డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, శ్రీనివాస్‌ను చందుర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఠాణాలో విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులకు కాంగ్రెస్‌ అండగా నిలుస్తుందని హామీఇచ్చారు. జెడ్పీటీసీ కుమార్, నాయకులు రాం రెడ్డి, ముకుందరెడ్డి, లింగారెడ్డి, రామస్వామి, ఫీర్‌ మహ్మద్‌ పాషా, 100 మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు