కేటీఆర్‌కు అబద్ధాల కోరు అవార్డు ఇవ్వాలి 

27 Feb, 2021 01:31 IST|Sakshi

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: వాస్తవాలను వక్రీకరించడంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సీఎం కేసీఆర్‌ను మించిపోయారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్‌కు స్కోచ్‌ అవార్డు కాకుండా జాతీయ స్థాయిలో అబద్ధాల కోరు అవార్డు ఇవ్వాలన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు కొత్తగా సృష్టించినవి కావని తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్‌ చేసి ఉద్యోగాలు భర్తీ చేశామని కేటీఆర్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సింగరేణిలో ఇచ్చామని చెప్తున్న 12 వేల ఉద్యోగాలు కూడా వారసత్వ ఉద్యోగాలేనని వివరించారు.

వేతనాలు చెల్లించలేక ఉద్యాన శాఖలో 400 మందిని, ఇతర కారణాలతో గ్రామపంచాయతీ స్థాయిలో వేలాది మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించారని మండిపడ్డారు. స్కూళ్లలో పనిచేసే స్వీపర్లను కూడా తొలగించారని, ఉద్యోగాలు ఇవ్వకపోగా తీసేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. బిస్వాల్‌ కమిటీ కూడా రాష్ట్రంలో 1.9 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పిందని, పదవీ విరమణ పొందినన్ని ఉద్యోగాలను కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భర్తీ చేయలేకపోయిందని దుయ్యబట్టారు. ఉద్యోగాలివ్వని టీఆర్‌ఎస్‌కు, గిరిజన వర్సిటీ ఇవ్వని బీజేపీకి మండలి ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్లు అడిగే అర్హత లేదని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు