తవ్వేకొద్దీ అక్రమాలు!

17 Sep, 2020 06:26 IST|Sakshi
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలోని 261 సర్వేనంబరు భూమి

ఖాజీపల్లి భూస్కాంలో అప్పటి జిన్నారం తహసీల్దార్‌దే కీలక పాత్ర 

మరికొందరు రెవెన్యూ అధికారులపై అనుమానాలు

సీలింగ్‌ భూములనూ వదలని అక్రమార్కులు 

లోతుగా విచారణ జరుపుతున్న అధికారులు 

సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లిలోని అసైన్డ్‌ భూమి వ్యవహారంలో తవ్వేకొద్దీ అక్రమాలు బయట పడుతున్నాయి. ఈ దందాలో అప్పటి తహసీల్దార్, ప్రస్తుతం సస్పెండైన కామారెడ్డి ఆర్డీఓ నరేందర్‌ కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. అసైన్డ్, సీలింగ్‌ భూములతో పాటు వివాదాస్పద భూముల్లో కూడా ఆయన జోక్యం ఉందని చెబుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఖాజీపల్లిలో సుమారు రూ.80 కోట్ల విలువ చేసే అసైన్డ్‌ భూమికి ఎసరు పెట్టారని సాక్షిలో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. అప్పటి జిన్నారం తహసీల్దార్, ప్రస్తుత కామారెడ్డి ఆర్డీఓ నరేందర్, మరొక అధికారిని సస్పెండ్‌ చేసింది. అలాగే.. మరో ఆరుగురు ఉద్యోగులు, నలుగురు మాజీ సైనికులపై క్రిమినల్‌ చర్యలకు ఆదేశించింది.

2012–13లో నరేందర్‌ జిన్నారం తహసీల్దార్‌గా ఉన్న సమయంలో అన్నారంలోని 261 సర్వే నంబర్‌లోని అసైన్డ్‌ భూములను కూడా పట్టాలుగా మార్చి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా కొనసాగాయి. మాదారంలోని అసైన్డ్‌ స్థలాన్ని గుట్టుచప్పుడు కాకుండా పట్టాగా మార్చినట్లు సమాచారం. అలాగే.. కొర్లకుంట గ్రామంలోని 35 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూములకు సంబంధించి అధికారులు రికార్డులు తారుమారు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఖాజీపల్లిలోని 180 సర్వే నంబర్‌లో సీలింగ్‌ భూమిని ఇతరులకు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూమిలో ఫ్యాక్టరీ నిర్మాణం కూడా జరుగుతున్నట్లు సమాచారం. నరేందర్‌ తహసీల్దార్‌గా ఉన్న సమయంలో జరిగిన స్థలాల మార్పిడి, ఇతర రెవెన్యూపరమైన అంశాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.  

మాజీ సైనికులకు నోటీసులు! 
అసైన్డ్‌ భూ దందాలో భాగస్వాములైన మాజీ సైనికులు తోట వెంకటేశ్వర్లు, ఉప్పు రంగ నాయకులు, ఎం.మధుసూదన్, ఎన్‌.గంగాధర్‌ రావులకు సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఖాజీపల్లిలోని 180 సర్వేనంబరు అసైన్డ్‌ భూమిని మీకు ఏ సంవత్సరంలో అప్పగించారు, ఎప్పటి నుంచి రికార్డులలో మీ పేరుంది? వాస్తవానికి ఈ భూమి ప్రభుత్వం మీకు ఇవ్వడానికి అర్హత ఉందా..? ఈ భూ కుంభకోణంలో మీ పాత్ర ఎంత ఉంది..? చనిపోయిన తహసీల్దార్‌ సంతకంతో మీకు పట్టాలు ఎవరిచ్చారు..? తదితర ప్రశ్నలకు 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నట్లు తెలిసింది. నోటీసులకు సరైన, సంతృప్తికరమైన సమాధానం రాకపోతే ఈ భూమిని ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోరాదనే అంశంపై కూడా వివరణ ఇవ్వాలని పేర్కొన్నట్లు సమాచారం.  

కొల్చారం తహసీల్దార్‌కూ లింకు!
కొల్చారం: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లిలోని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో ప్రస్తుత కొల్చారం తహసీల్దార్‌ పాత్ర ఉందని తేలింది. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన ఆయన.. ఈ నెల 14వ తేదీ నుంచి సెలవుపై వెళ్లినట్లు తెలిసింది. అప్పట్లో సహదేవ్‌ జిన్నారం తహసీల్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేశారు. భూ దందాల్లో కూడా సహదేవ్‌ పాత్ర ఉందని, ఆయనపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్‌కు  సీఎస్‌ సోమేశ్‌కుమార్‌  ఆదేశించారు. కాగా, రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి సంబంధించిన సర్వే నంబర్‌ 297లో గల 0.13 గుంటల భూమికి సంబంధించి ప్రస్తుతం హైకోర్టులో సహదేవ్‌ విచారణ ఎదుర్కొంటున్నారు.   

మరిన్ని వార్తలు