ఎంటెక్‌: కొన్ని పాత కోర్సులకు కత్తెర.. 7 కొత్త కోర్సులు

19 Apr, 2021 17:45 IST|Sakshi

ఈసారి కూడా తనిఖీలు లేకుండానే అనుబంధ గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కొత్తగా పలు ఎంటెక్‌ కోర్సులు ప్రవేశపెట్టేందుకు జేఎన్టీయూ చర్యలు చేపట్టింది. గతేడాది కొత్త కోర్సుల్లో ఆరి్టఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నిం గ్, డేటా సైన్స్‌ వంటి ప్రధాన సబ్జెక్టులతోనే కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇవ్వగా, ఈసారి వాటి సంఖ్య పెంచి 7 రకాల కొత్తకోర్సులు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. ఈ జాబితాలో.. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (సీఎస్‌ఈ)లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్, సైబర్‌ సె క్యూరిటీ.. సివిల్‌ ఇంజనీరింగ్‌లో కంప్యూటర్‌ ఎయిడెడ్‌ స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌.. ఈసీఈలో ఎంబెడెడ్‌ సిస్టమ్‌ అండ్‌ వీఎల్‌ఎస్‌ఐ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, మైక్రో ఎల్రక్టానిక్స్‌ అండ్‌ వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌.. మెకా నికల్‌లో మెకట్రానిక్స్‌ పీజీ కోర్సులు ఉన్నాయి. 

కొన్ని కాంబినేషన్లకు కత్తెర! 
గతేడాది బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో (సీఎస్‌ఈ) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్, సైబర్‌ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్, డేటా సైన్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, సీఎస్‌ఈ నెట్‌వర్క్స్‌ కోర్సులకు జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు జారీ చేసింది. అయితే ఈసారి (2021–22లో) బీటెక్‌ సీఎస్‌ఈలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డాటా సైన్స్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ డిజైన్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషీన్‌ లెరి్నంగ్, మెకానికల్‌లో ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌కు అనుబంధ గుర్తిం పు ఇస్తామని ప్రకటించింది. ఇందులో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ డిజైన్, ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌ను ప్రత్యేక కోర్సులుగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ కోర్సులకు కాలేజీల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవచ్చని జేఎనీ్టయూ వెల్లడించింది. అయితే గతేడాది బీటెక్‌లో ఇచి్చన సీఎస్‌ఈ నెట్‌వర్క్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్, సైబర్‌ సెక్యూరిటీ కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇస్తారా, లేదా? అన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. 

పాత వివరాలతోనే.. 
రాష్ట్రంలోని వృత్తి, సాంకేతిక విద్యా కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ చేసేందుకు నిర్వహించే ‘ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీల (ఎఫ్‌ఎఫ్‌సీ)’తనిఖీలు ఈసారి నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. గత ఏడాది కరోనా ఎఫెక్ట్‌తో తనిఖీలు చేయలేదు. ప్రస్తుతం కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. రెండేళ్ల కిందటి తనిఖీలు, గతేడాది కాలేజీలు అందజేసిన డాక్యుమెంట్ల పరిశీలన, తాజాగా అందజేసే అఫిడవిట్ల ఆధారంగానే అనుబంధ గుర్తింపు జారీ చేసేందుకు యూనివర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి. మే మొదటి లేదా రెండో వారంలో ‘అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)’నుంచి కాలేజీలకు, కోర్సులకు అనుమతులు లభించనున్నాయి. ఆ వెంటనే రాష్ట్ర యూనివర్సిటీలు ఆయా కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ కోసం దరఖాస్తులు స్వీకరించనున్నాయి.  మరోవైపు ఈసారి ఇంకో 12 వరకు ఇంజనీరింగ్‌ కాలేజీలు మూతపడే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

చదవండి: ఆ రెండు సబ్జెక్టులు రాకుంటే.. ఇంజనీరింగ్‌లో సాధ్యమేనా?!

మరిన్ని వార్తలు