ఇంటికి దగ్గర్లోనే పరీక్షలు

30 Aug, 2020 01:39 IST|Sakshi

జేఎన్టీయూ ప్రత్యేక చర్యలు

బీటెక్, బీఫార్మసీ తదితర పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

విద్యార్థుల ఇంటి సమీపంలోని కాలేజీల వివరాలు సేకరణ

వాటిల్లో ఏదో ఒక దాంట్లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసేలా చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో నడవడం లేదు.. హాస్టళ్లు ఇంకా తెరువలేదు. బయట అద్దె ఇళ్లలో ఉండి పరీక్షలు రాసే అవకాశం లేదు.. విద్యార్థులు వార్షిక పరీక్షలు రాసేందుకు తమ కాలేజీలకు వచ్చే పరిస్థితి లేదు. అందుకే విద్యా ర్థులున్న చోటే పరీక్షలు రాసేలా జేఎన్టీయూ చర్యలు చేపట్టింది. ఫైనల్‌ ఇయర్‌ ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థులు ప్రస్తుతం ఉంటున్న చోటే వారికి పరీక్షలు నిర్వహించాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది. బీటెక్, బీఫార్మసీ తదితర పరీక్షలకు కేంద్రాలను విద్యార్థులు ఉంటున్న దగ్గరే కేటాయించేలా ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్‌ 16 నుంచి నిర్వహించే పరీక్షలకు ఈ విధానం అమలు చేసేలా చర్యలు చేపట్టింది.

ప్రిన్సిపాళ్లకు వివరాలు..
ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థులు ప్రస్తుతం తాము ఉంటున్న అడ్రస్, సమీపంలో ఉన్న రెండుమూడు కాలేజీల వివరాలను తమ కాలేజీల ప్రిన్సిపాళ్లకు అందజేస్తే వాటిల్లో ఏదో ఒక కాలేజీలో సదరు విద్యార్థులకు పరీక్ష కేంద్రం కేటాయించేలా చర్యలు చేపట్టింది.  ఈ విధానంతో దాదాపు 60 వేల మంది విద్యార్థులు తమ దగ్గరలోని కాలేజీల్లోనే ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు జేఎన్టీయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ మంజూరు హుస్సేన్‌  వెల్లడించారు. దీనికోసం ఈనెల 31 వరకు గడువు ఇచ్చామని తెలిపారు. విద్యార్థులు తమ సమీపంలోని కాలేజీల వివరాలను, ఇంటి అడ్రస్‌ను.. తమ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఇవ్వాలని, వారు తమకు పంపిస్తే వాటి ఆధారంగా ఆయా విద్యార్థులందరికి దగ్గరలోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. జేఎన్టీయూ అమలు చేస్తున్న ఈ విధానాన్ని ఉస్మానియా, ఇతర యూనివర్సిటీలు కూడా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. సెప్టెంబర్‌ 15 నుంచి నిర్వహించే సంప్రదాయ డిగ్రీ, పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలను ఈ విధానంలో నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు.  

>
మరిన్ని వార్తలు