‘బ్రాండెడ్‌’ బెస్ట్: రంగు నీళ్లన్నీ  శానిటైజర్లు కాదు 

5 Jun, 2021 06:35 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మెరిసేదంతా బంగారం కాదన్న చందంగా మారింది శానిటైజర్ల పరిస్థితి. కోవిడ్‌ మహామ్మారి విజృంభిస్తోన్న ప్రస్తుత తరుణంలో ప్రతీ ఒక్కరికీ ఇప్పుడు తరచూ చేతులను శానిటైజర్‌తో శుభ్రపరచుకోవడం దినచర్యగా మారింది. ఇదే తరుణంలో బహిరంగ మార్కెట్‌లో అందమైన డబ్బాలు, బాటిళ్లలో ప్యాక్‌చేసి..తీరైన లేబుల్స్‌ అంటించి విక్రయిస్తోన్న రంగునీళ్లన్నీ శానిటైజర్లు కావని జేఎన్‌టీయూ, బిట్స్‌పిలానీ తాజా పరిశోధనలో స్పష్టమైంది.

లేబుల్స్‌పై పేర్కొన్న విధంగా ఇవన్నీ సరైన ప్రమాణాల ప్రకారం సిద్ధం చేసినవి కావని..వీటితో చేతులపై ఉన్న వైరస్, బ్యాక్టీరియా ఆనవాళ్లు అంత త్వరగా నశించవని ఈ పరిశోధన తేటతెల్లం చేసింది. ప్రధానంగా వీటిల్లో ఇథైల్‌ ఆల్కహాల్‌ శాతం తక్కువగా ఉండడం, ఇతర ప్రమాణాలను పాటించకపోవడంతోనే ఈ అనర్థాలు తలెత్తుతున్నాయని పరిశోధకులు స్పష్టంచేశారు. 

పరిశోధనలో తేలింది ఇదీ.. 
బహిరంగ మార్కెట్‌లో దొరికే పలు రకాల బ్రాండ్ల శానిటైజర్లను సేకరించి..నగరంలోని జేఎన్‌టీయూహెచ్, బిర్లా ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్, పిలానీ (హైదరాబాద్‌ క్యాంపస్‌) పరిశోధకులు తమ ప్రయోగశాలల్లో వాటి నాణ్యతను పరీక్షించారు.  
► పలు లోకల్‌ మేడ్‌ శానిటైజర్లలో ఇథైల్‌ ఆల్కహాల్‌ 95 శాతం ఉందంటూ లేబుల్‌పై ప్రకటించారు. కానీ వీటిల్లో కేవలం ఆల్కహాల్‌ 50 శాతానికి మించ లేదని తమ పరిశోధనలో తేలిందని జేఎన్‌టీయూహెచ్‌ పరిశోధకులు ప్రొఫెసర్‌ బిందు తెలిపారు.  
► తాము ఆయా శానిటైజర్లను గ్యాస్‌ క్రోమాటోగ్రఫీ విధానంలో పరీక్షించామని పేర్కొన్నారు. మరికొన్నింటిలో కేవలం 5 శాతం మాత్రమే 
ఇథైల్‌ ఆల్కహాల్‌ ఉందని స్పష్టంచేశారు.  
► ఆయా శానిటైజర్లు వైరస్, బ్యాక్టీరియాలను ఎలా నిరోధిస్తున్నాయన్న అంశంపైనా మైక్రోబయాలజికల్‌ విశ్లేషణ జరిపామని...వీటిల్లోనూ ఆయా లోకల్‌మేడ్‌ శానిటైజర్లు నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయని తెలిపారు.  
► మరికొన్నింటిలో ఇథనాల్, ఐసో ప్రొపనాల్‌ మోతాదు కూడా సరైన ప్రమాణాల్లో కలపకపోవడంతో బ్యాక్టీరియా, వైరస్‌లను నిరోధించలేవని స్పష్టమైందన్నారు. 

నాణ్యత చూసి కొనండి 
బహిరంగ మార్కెట్‌లో దొరికే శానిటైజర్లలో బ్రాండెడ్‌వి, నాణ్యమైనవి చూసి కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతీ ఒక్కరూ వివిధ పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లడం అనివార్యమైన తరుణంలో వినియోగించే శానిటైజర్‌ నాణ్యత ప్రమాణాల ప్రకారం ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. లేకుంటే కోవిడ్‌ ముప్పు రావొచ్చని హెచ్చరించారు. 

విక్రయాలు ఫుల్‌..నాణ్యత నిల్‌
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లు, వీధి వ్యాపారులు, కిరాణా దుకాణాలు, మెడికల్‌ షాపులు ఇలా అన్ని ప్రదేశాల్లోనూ ‘మూడు మాస్కులు..ఆరు శానిటైజర్లు’ అన్న చందంగా వ్యాపారం సాగుతోంది. ప్రతి రోజు రూ.కోట్లలో విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుత తరుణంలో వీటితయారీ సంస్థలకు సైతం పీసీబీ సులభంగా అనుమతులు జారీచేస్తోంది. ఇదే సమయంలో కొందరు కుటీర పరిశ్రమగా ఇళ్లు, పురాతన షెడ్లలో నాసిరకం శానిటైజర్లు తయారీచేసి విక్రయిస్తున్నారు. వీటి నాణ్యతే ప్రశ్నార్థకంగా మారింది.
చదవండి: కరోనా రోగులకు ఇక సహజ వాయువే!

మరిన్ని వార్తలు