‘బయోమెట్రిక్‌’ అమలు చేయాల్సిందే..

5 Sep, 2022 03:33 IST|Sakshi

లేకపోతే ఫ్యాకల్టీగా పరిగణించం.. గుర్తింపు ఇవ్వం 

ఇంజనీరింగ్‌ కాలేజీలకు జేఎన్‌టీయూహెచ్‌ నోటీసులు 

8లోగా వివరణ ఇవ్వకుంటే చర్యలు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల ఆటలకు చెక్‌ పెట్టేలా హైదరాబాద్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూహెచ్‌) చర్యలకు ఉపక్రమించింది. కాలేజీలకు వర్సిటీ అనుబంధ గుర్తింపుప్రక్రియలో భాగంగా అధ్యాపకులకు బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ తప్పనిస రి చేసిన వర్సిటీ.. దానిని అమలు చేయని కాలేజీలకు నోటీసులు జారీచేస్తోంది.

అధ్యాపకులకు రోజువారీ బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ ఎందుకు అమలు చేయడం లేదని ఆయా నోటీసుల్లో ప్రశ్నించింది. కనీస హాజరు శాతం కూడా ఉండడం లేదని పేర్కొంది. కాలేజీల తనిఖీల సమయంలో బయోమెట్రిక్‌ హాజరులేని బోధన సిబ్బందిని పరిగణనలోకి తీసుకోబోమని, వారిని ఫ్యాకల్టీగా భావించబోమని స్పష్టం చేసింది. ఈ విద్యాసంవత్సవరం నుంచి బయోమెట్రిక్‌ హాజరును పాటించకపోతే తదుపరి అనుబంధ గుర్తింపునకు  అవకాశం ఉండబోదని తెలిపింది. దీనిపై ఈ నెల 8లోగా వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో యూనివర్సిటీ నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని హెచ్చరించింది. 

తనిఖీల్లో గుర్తింపుతో.. 
2022–2023 విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపు కోసం వర్సిటీ కమిటీలు కాలేజీల్లో గతనెల 18 నుంచి 22 వరకు తనిఖీలు నిర్వహించాయి.   వర్సిటీ సర్వర్‌లో అధ్యాపకుల బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ నమోదు కాని విషయాన్ని గమనించి నివేదిక సమర్పించాయి. ఈ నేపథ్యంలో జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ కళాశాలలకు నోటీసులు జారీ చేశారు. 

సగానికి పైగా కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత 
జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో సుమారు 143 కళాశాలలు ఉండగా సగానికి పైగా కళాశాలల్లో ఫ్యాకల్టీ కొరత వెంటాడుతోంది. మరోవైపు అధికారిక లెక్కల్లో ఫ్యాకల్టీ ఒకరు ఉంటే, వాస్తవంగా మరొకరు బోధిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఫార్మసీ లాబ్‌ల్లో, మెడికల్‌ షాపుల్లో పనిచేసేవారితో పాటు, సాఫ్ట్‌వేర్‌æ కంపెనీలు, ప్రభుత్వ రంగ కంపెనీలు (కాంట్రాక్ట్‌ పద్ధతిలో), ప్రైవేట్, డీమ్డ్‌ యూనివర్సిటీల్లో ఉన్నవారిని ఫ్యాకల్టీగా కళాశాలలు చూపించడం సర్వసాధారణమైంది. ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దే దిశలో జేఎన్‌టీయూహెచ్‌ చర్యలకు దిగుతున్నట్టు తెలుస్తోంది.  

నాణ్యమైన విద్య అందుతుంది 
ఇంజనీరింగ్‌ కాలేజీల అధ్యాపకులకు బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ తప్పనిసరి చేసి, దానిని అమలు చేయని కాలేజీల కు నోటీసులు జారీ చేయడం హర్షణీయం. దీని వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. కొన్ని కాలేజీల్లో సిలికాన్‌ వేలిముద్రలు వినియోగిస్తున్నారు. దానిపైనా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి.
– అయినేని సంతోష్‌ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, టీఎస్‌టీసీఈఏ  

మరిన్ని వార్తలు