గురుకులం.. ఇక కొలువుల కోలాహలం! 

21 Jun, 2022 01:17 IST|Sakshi

9,096 బోధన కొలువుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి 

ఇండెంట్లు సిద్ధం చేసుకున్న నాలుగు గురుకుల సొసైటీలు 

ఒకట్రెండు రోజుల్లో నియామకాల బోర్డుకు ప్రతిపాదనలు 

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో కొలువుల జాతరకు వేళ అయింది. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ప్రక్రియ పట్టాలెక్కింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల సొసైటీల పరిధిలో బోధన సిబ్బంది కేటగిరీలో 9,096 ఉద్యోగ నియామకాలకు గతవారం ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యం లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనల రూపకల్పనలో సొసైటీలు తలమునకలయ్యాయి.

అనుమతించిన పోస్టులు, జోన్లవారీగా విభజన, రిజర్వేషన్లు, రోస్టర్‌ పాయింట్లకు సంబంధించి మరోమారు పరిశీలన చేపట్టాయి. ఒకట్రెండు రోజుల్లో వీటిని నిర్ధారణ చేసుకున్న తర్వాత గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డుకు ప్రతిపాదనలు సమర్పించనున్నట్లు సొసైటీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం బీసీ గురుకుల విద్యాసంస్థలు 261, ఎస్సీ 230, ఎస్టీ 105, మైనారిటీ విద్యాసంస్థలు 207 ఉన్నాయి. 

బీసీ గురుకులాల్లో అత్యధిక పోస్టులు 
రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాసంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. విద్యాసంస్థల మంజూరు సమయంలోనే శాశ్వత ఉద్యోగ నియామకాలపై స్పష్టత ఇచ్చింది. ఏటా 25 శాతం చొప్పున నాలుగేళ్లలో అన్ని సొసైటీల్లో రెగ్యులర్‌ ఉద్యోగ నియామకాలు పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించింది. నియామకాల కోసం ప్రత్యేకంగా తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ)ని ఏర్పాటు చేసింది.

ఈ క్రమంలో ఇప్పటికే 10 వేల ఉద్యోగాలను భర్తీ చేయగా, తాజాగా మరో 9,096 ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం భర్తీ చేయనున్న కొలువుల్లో అత్యధికం బీసీ గురుకుల సొసైటీ పరిధిలోనే ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత అత్యధికంగా 238 బీసీ గురుకుల విద్యాసంస్థలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీసీ గురుకులాల్లోనే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది.

బీసీ గురుకుల సొసైటీకి 3,870, ఎస్సీ 2,267, ఎస్టీ 1,514, మైనార్టీ సొసైటీలో 1,445 చొప్పున ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. సొసైటీలవారీగా ప్రతిపాదనలు స్వీకరించిన తర్వాత గురుకుల నియామకాల బోర్డు వాటిని అన్నివిధాలా పరిశీలించి ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయనుంది.  

మరిన్ని వార్తలు