హస్తం గూటికి జెడ్పీ సారథులు

16 Feb, 2024 04:14 IST|Sakshi

అసెంబ్లీ ఎన్నికలకు ముందే మేడ్చల్‌ జెడ్పీ చైర్మన్‌ చేరిక 

నేడు కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్న వికారాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి 

ఈనెల 20 తర్వాత రంగారెడ్డి  జెడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి కూడా? 

సాక్షి, రంగారెడ్డి జిల్లా, తాండూరు: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ నేతలు ఆ పార్టీ అధిష్టానానికి షాక్‌లిస్తున్నారు. ఓ వైపు లోక్‌సభ ఎన్నిక లు దగ్గర పడుతుండగా, మరో వైపు గులాబీ పార్టీ కి గుడ్‌ బై చెప్పేందుకు ముహూర్తాలు చూసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే మేడ్చల్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి కారు దిగి హ స్తం గూటికి చేరుకోగా, తాజాగా వికారాబాద్‌ జెడ్పీ చైర్‌ పర్సన్‌ సునీతారెడ్డి శుక్రవారం గాందీభవన్‌ వేదికగా హస్తం గూటిలో చేరనున్నారు.

ముందుగా బీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి కార్యకర్తలతో భారీ ర్యాలీగా గాంధీభవన్‌కు వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపా దాస్‌మున్షీ, మంత్రుల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు.

ఆమెతో పాటు కుమారుడు రినీష్ రెడ్డి కూడా పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. వీరిరువురినీ పార్టీలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి.. తాను మాత్రం త్వరలో చెవేళ్ల పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పార్టీ కండువా వేసుకోనున్నట్టు చెబుతున్నారు. 

సునీత దారిలోనే అనిత.. 
మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఆ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్‌ను కలిశారు. అధికారికంగా పార్టీ కండువా కప్పుకోక పోయినా.. పార్టీ మార్పుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

కృష్ణారెడ్డి కోడలు, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి కూడా త్వరలో కారు దిగేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఎప్పుడు పార్టీ లో చేరనున్నారనే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ నెల 20న జెడ్పీ సర్వసభ్య సమావే శం ముగిసిన తర్వాత ఆమె కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది.

కాగా, అనితారెడ్డి మరోసారి జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సారి మహేశ్వరం నుంచి కాకుండా కందుకూరు నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత జెడ్పీ పీఠాన్ని మళ్లీ ఆమెకే కట్టబెట్టేందుకు సీఎం రేవంత్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది. 

whatsapp channel

మరిన్ని వార్తలు