Telangana: ఆ ఊరికి ఏమైంది..?

10 Oct, 2021 02:04 IST|Sakshi
భేతాళపాడు పంచాయతీ పరిధిలోని పంతులుతండా

ఆ ఊరును కిడ్నీవ్యాధి పీడిస్తోంది. అంతుచిక్కకుండా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఆ వ్యాధి సోకి పలువురు మృత్యుకోరల్లో చిక్కుకున్నారు. చాలామంది డయాలసిస్‌ కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వైద్యానికి డబ్బుల్లేక మరికొందరు దీనంగా రోజులు వెళ్లదీస్తున్నారు. ఇదీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామపంచాయతీ పరిస్థితి. ఆ గ్రామపంచాయతీ పరిధిలోని పంతులుతండా, టాక్యాతండా, పీక్లాతండా, చీపురుగూడెం, రాచబండ్ల కోయగూడెం, రేగళ్లతండా గ్రామాల ప్రజలు కూడా ఈ వ్యాధితో పోరాడుతున్నారు. 2015 నుంచి ఇప్పటివరకు కిడ్నీ సంబంధితవ్యాధితో 28 మంది మృతి చెందారు. గత పదిరోజుల వ్యవధిలోనే పంతులుతండాలో గుగులోత్‌ దేవిజ్యా(58), ధరావత్‌ వీరు(38) మృత్యువాతపడ్డారు. ఈ పంచాయతీ పరిధిలో 18 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా పడకలు, వసతుల్లేక ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో డయాలసిస్‌ చేయించుకోవాల్సి వస్తోందని బాధితులు అంటున్నారు.     

– జూలూరుపాడు

భద్రాద్రి జిల్లా భేతాళపాడులో అంతుచిక్కని కిడ్నీవ్యాధి 
ఏడేళ్లుగా ఇదే తంతు... : ఈ పంచాయతీ పరిధిలోని ప్రజలు ఏడేళ్లుగా కిడ్నీవ్యాధితో బాధపడుతున్నా, పలువురు పిట్టల్లా రాలిపోతున్నా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుందో అంతుపట్టడం లేదని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 2017లో ఒకే రోజు ఇద్దరు మృతి చెందడంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నామమాత్రంగా స్పందించి, అక్కడి ప్రజల తాగునీటి శాంపిళ్లను పరీక్షించి ఫ్లోరైడ్‌ సమస్య లేదని తేల్చారు. ఆ తర్వాత కూడా కిడ్నీవ్యాధి నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

ప్రజలు ఎందుకు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారనే విషయాలను తేల్చడంలో ప్రభుత్వం, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. భేతాళపాడు, పంతులుతండా, టాక్యాతండా, పీక్లాతండా గ్రామాల్లో ఫ్లోరైడ్‌ సమస్య వల్లే కీళ్లు, ఒంటినొప్పులు, కాళ్లవాపులు రావడంతోపాటు కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

డాక్టర్లు దయచూపాలె 
గత నాలుగేళ్లుగా భార్యాభర్తలిద్దరం కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాం. డయాలసిస్‌ చేస్తే చనిపోతావని, బలహీనంగా ఉన్నావని, మందులు వాడమని నాకు డాక్టర్లు చెప్పారు. నా భార్య లక్ష్మి కీళ్లనొప్పులు, ఒళ్లు, నడుము నొప్పుల బాధ భరించలేకపోతోంది. ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లే మాపై దయ చూపాలి. 

–బానోత్‌ పరశ్యా, పంతులుతండా  

వారానికి రెండుసార్లు 
డయాలసిస్‌ చేయించుకుంటున్నా రెండేళ్లుగా మూత్రపిండాలవ్యాధితో బాధపడుతున్నా. వారానికి రెండుసార్లు ఖమ్మం ఆస్పత్రికి వెళ్లి డయాలసిస్‌ చేయించుకుంటున్నా. నెలకు రూ.20 వేలు ఖర్చవుతున్నాయి. డయాలసిస్‌ కోసం కొత్తగూడెం, భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే పడకలు ఖాళీగా లేవని డాక్టర్లు అంటున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్దామంటే డబ్బుల్లేవు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలి.   

– బానోత్‌ మంగ్యా, టాక్యాతండా  

రక్త నమూనాలు సేకరిస్తాం 
భేతాళపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలు కిడ్నీవ్యాధితో బాధపడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. బాధితుల రక్త నమూనాలు సేకరించాలని పీహెచ్‌సీ డాక్టర్‌ను ఆదేశించాం. బ్లడ్‌ శాంపిల్స్‌ను టీ హబ్‌కు పంపిస్తాం. భేతాళపాడుతోపాటు తండాల్లో నీటి నమూనాలు కూడా సేకరించాలని చెప్పాం. అన్ని శాఖల సమన్వయంతో ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. 

– శిరీష, డీఎంహెచ్‌వో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  

మరిన్ని వార్తలు