Telangana: నేటి నుంచి జూడాల సమ్మె

26 May, 2021 03:28 IST|Sakshi

అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరణ 

డిమాండ్లు పరిష్కరించాలని ఈ నెల 10న నోటీసు 

ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రాని స్పందన 

దీంతో నోటీసు ప్రకారం జూనియర్‌ డాక్ట్టర్ల విధుల బహిష్కరణ  

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ ఉధృతి సమయంలో జూనియర్‌ డాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి షాకిచ్చారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ బుధవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరి స్తున్నట్లు తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ ప్రకటించింది. డిమాండ్ల సాధనలో భాగంగా ఈ నెల 10న టి–జూడా రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డికి సమ్మె నోటీసు ఇచ్చారు. పక్షం రోజుల్లో తమ డిమాండ్లు పరిష్కరించాలని నోటీసులో స్పష్టం చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నట్లు జూడాల సంఘం స్పష్టం చేసింది.

ఈ సమ్మెతో బోధనాస్పత్రుల్లో వైద్య సేవలు సంకటంలో పడనున్నాయి. ప్రస్తుతం కోవిడ్‌ తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని బోధనాస్పత్రులు బాధితులతో నిండిపోయాయి. కోవిడ్‌యేతర సేవలకు సంబంధించిన వార్డుల్లో కూడా రద్దీ కొనసాగుతోంది. రోజువారీ అవుట్‌ పేషంట్ల(ఓపీ) విభాగాలు సైతం కిటకిటలాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బోధనాస్పత్రుల్లో సేవలందించే జూనియర్‌ డాక్టర్లు సమ్మె చేపట్టడంతో గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో అత్యవసర, ఐసీయూ విధులకు మాత్రమే హాజరు కానున్నట్లు ప్రకటించారు. దీంతో మిగతా వార్డుల్లో సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం ఈ రెండ్రోజుల్లో స్పందించకుంటే 28 నుంచి అన్ని రకాల విధులు బహిష్కరించనున్నట్లు జూడాలు ప్రకటించారు. రాష్ట్రంలో దాదాపు 6 వేల మంది జూనియర్‌ డాక్టర్లు, మరో వెయ్యి మంది వరకు సీనియర్‌ రెసిడెంట్లు ఉన్నారు.ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వీరి సేవలే కీలకం. 

టీఎస్‌ఆర్‌డీఏ కూడా... 
జూనియర్‌ డాక్టర్ల సమ్మెతో పాటు తెలంగాణ సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (టీఎస్‌ఆర్‌డీఏ) కూడా సమ్మెకు దిగనుంది. ఇప్పటికే వైద్య, విద్య సంచాలకుడికి సమ్మె నోటీసు జారీ ఇచ్చిన టీఎస్‌ఆర్‌డీఏ.. బుధవారం ఉదయం 9 గంటల నుంచి కోవిడ్‌ అత్యవసర సేవలు, ఐసీయూ సేవలకు మాత్రమే హాజరుకానున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే ఈనెల 27 నుంచి అన్నిరకాల విధులు బహిష్కరించనున్నట్లు టీఎస్‌ఆర్‌డీఏ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 

ఈనెల 26 నుంచి నాన్‌కోవిడ్‌ ఆస్పత్రుల్లో సాధారణ విధులు బహిష్కరిస్తున్నాం. ప్రభుత్వం స్పందించకుంటే ఈనెల 28 నుంచి కోవిడ్, నాన్‌ కోవిడ్‌ ఆస్పత్రుల్లో సాధారణ, ఐసీయూ, అత్యవసర సర్వీసులను బహిష్కరిస్తాం. ఈనెల 19న గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్‌ జూడాల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకుందామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నాం. 
– జూడాల అసోసియేషన్‌ రాష్ట్ర ప్రతినిధులు డాక్టర్‌ వాసరి నవీన్, స్వరూప్, విజయ్‌ 


కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 500 జూడాలు, 150 మంది సీనియర్‌ రెసిడెంట్లు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యాం. మా డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావంతో ఉన్నాం.  – జూడాల సంఘ గాంధీ యూనిట్‌ అధ్యక్షుడు మణికిరణ్‌రెడ్డి 

ప్రధాన డిమాండ్లు...

  •    జూనియర్‌ డాక్టర్లు, సీనియర్‌ డాక్టర్లతో పాటు ఇంటర్న్‌లకు 15 శాతం స్టైపెండ్‌ పెంపు ఫైలు ఆర్థికశాఖ వద్ద ఉంది. అలాగే సీనియర్‌ రెసిడెంట్లకు 15 శాతం పెంపు ఫైలు కూడా పెండింగ్‌లో ఉంది. దీన్ని తక్షణమే పరిష్కరించి పెంచిన స్టైపెండ్‌ను అందించాలి. 
  • వైద్యులు, వైద్య సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం ఇన్సెంటివ్‌ను ప్రకటించినా.. అమలు చేయలేదు. దాన్ని అమలుచేయాలి.
  •  కోవిడ్‌ విధులు నిర్వహిస్తున్న హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌(హెచ్‌సీడబ్ల్యూ), వాళ్ల కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో చికిత్స అందించాలి. దీని కోసం అదనపు వార్డులు ఏర్పాటు చేయాలి. ఇతర ఆస్పత్రుల్లోనూ ఉచిత చికిత్స పొందే అవకాశం కల్పించాలి. 
  • జీఓఎంఎస్‌–74 ప్రకారం వైద్య విద్యార్థుల(పోస్టు గాడ్యుయేషన్‌ వరకు)కు మెడికల్‌ ఇన్సూరెన్స్‌ను అమలుచేయాలి.  
  • కోవిడ్‌ విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు పరిహారం ద.. డాక్టర్‌కు రూ.50 లక్షలు, నర్సు, సపోర్టింగ్‌ స్టాఫ్‌కు రూ.25 లక్షలు చెల్లించాలి.

జూడాల బహిష్కరణ ఇలా.
 నేటి నుంచి ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా కోవిడ్‌యేతర విధుల బహిష్కరణ. కోవిడ్‌ కేటగిరీలో ఐసీయూ, క్రిటికల్‌ కేర్‌ విధులు మినహా మిగతావన్నీ కూడా.(ఈనెల 28 నుంచి ఈ విధులూ బహిష్కరణ) 

సీనియర్‌ రెసిడెంట్లు ఇలా.. 
బుధవారం ఉదయం 9 గంటల నుంచి కోవిడ్‌ అత్యవసర సేవలు, ఐసీయూ సేవలకు మాత్రమే హాజరు. (రేపట్నుంచి అన్నిరకాల విధుల బహిష్కరణ) 

ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో డీఎంఈ..
జూనియర్‌ డాక్టర్లు సమ్మెకు దిగుతున్నట్లు ఇచ్చిన వినతిని పరిగణించడం లేదని డీఎంఈ స్పష్టం చేసింది. జూడాలు విధులు బహిష్కరిస్తే.. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సంబంధిత ప్రిన్స్‌పాల్స్, డైరెక్టర్స్, సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్, ఇతర వైద్య సేవలందించడంలో ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కొత్తగా డ్యూటీ రోస్టర్‌ను రూపొందించి డీఎంఈ కార్యాలయానికి పంపించాలని స్పష్టం చేసింది. డైరెక్టరేట్‌ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సెలవులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు