చర్చలు విఫలం.. సమ్మె యథాతథం

27 May, 2021 02:01 IST|Sakshi

సమ్మె కొనసాగుతుందని ప్రకటించిన జూడాలు

అంతకుముందు చర్చలు జరపాలని అధికారులకు సీఎం ఆదేశం

డీఎంఈ రమేశ్‌రెడ్డితో జూనియర్‌ డాక్టర్ల మంతనాలు 

లిఖితపూర్వక హామీకి పట్టు.. కుదరదన్న డైరెక్టర్‌

సాక్షి, హైదరాబాద్‌: జూనియర్‌ డాక్టర్ల సంఘంతో వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి జరిపిన చర్చ లు విఫలమయ్యాయి. బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు డిమాండ్లపై చర్చించినా డైరెక్టర్‌ నుం చి స్పష్టమైన హామీ రాలేదని, దీంతో సమ్మెను కొనసాగిస్తున్నట్లు జూనియర్‌ డాక్టర్ల సంఘం ప్రకటించింది. లిఖితపూర్వక హామీలు రాకపోవడం, డైరెక్టర్‌తో జరిగిన చర్చలు సానుకూలంగా లేకపోవడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు వెల్లడిం చింది. పలు డిమాండ్లతో జూనియర్‌ డాక్టర్లు బుధవారం నుంచి సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.

స్టైఫండ్‌ పెంపుతోపాటు ప్రోత్సాహకాలు, కోవిడ్‌ విధుల్లో మరణిస్తే ఇచ్చే పరిహారం, కరోనాతో బాధపడుతున్న కుటుంబసభ్యులకు నిమ్స్‌లో ఉచిత చికి త్స వంటి అంశాలపై జూడాలు సమ్మెకు దిగారు. తొలిరోజు సమ్మెలో భాగంగా బుధవారం అత్యవసర సేవలు, ఐసీయూ సేవలకు మాత్రమే హాజరు కాగా, మిగతా విధులను బహిష్కరించారు. ఈ క్రమంలో బుధవారం సీఎం కేసీఆర్‌ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షిస్తూ... ప్రస్తుత సమయంలో సమ్మె సరికాదని, జూడాల డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుపుతూ చర్చలు జరపాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్‌ సైతం సమ్మెకు ఇది సరైన సమయం కాదని ట్విట్టర్‌ ద్వారా విన్నవించారు. ఈ క్రమంలో బుధవారం సాయం త్రం వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి జూడాల సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు.

జూనియర్‌ డాక్టర్లు, సీనియర్‌ రెసిడెంట్లకు 15 శాతం స్టైఫండ్‌ పెంపు పట్ల సీఎం సానుకూలంగా ఉన్నట్లు చెప్పినా లిఖితపూర్వక హామీ రాలేదు. డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డి జూడాల హామీలు అమలు చేయడం కుదరదని చెప్పడంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. అనంతరం బయటకు వచ్చిన జూడాల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి సానుకూల హామీలు వస్తే సమ్మె విరమిస్తా మని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ సూచనలతో చర్చలు జరిపామని పేర్కొన్నారు. అయితే సీఎం, మంత్రి నుంచి వచ్చిన సానుకూల స్పందన అధికారుల నుంచి రాకపోవడంతో సమ్మె ను కొనసాగించాల్సి వస్తోందని చెప్పారు. రేపటి నుంచి అత్యవసర సేవలూ బహిష్కరిస్తామని జూనియర్‌ డాక్టర్లు పేర్కొన్నారు.  

సమ్మె సరికాదు.. 
‘జూనియర్‌ డాక్టర్లవి న్యాయమైన కోరికలైనప్పుడు, పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం వుండబోదు. చీటికీ మాటికీ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా, కరోనా పరిస్థితులను కూడా చూడకుండా విధులను బహిష్కరించడం
సరికాదు’.    – సీఎం కేసీఆర్‌

కొనసాగిస్తున్నాం... 
లిఖితపూర్వక హామీలు రాకపోవడం, డైరెక్టర్‌తో జరిగిన చర్చలు సానుకూలంగా లేకపోవడంతో సమ్మెను కొనసాగిస్తున్నాం. మా హామీలు అమలు చేయడం కుదరదని రమేశ్‌రెడ్డి తేల్చిచెప్పారు. ప్రభుత్వం నుంచి సానుకూల హామీలు వస్తే సమ్మె విరమిస్తాం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ నుంచి వచ్చిన సానుకూల స్పందన అధికారుల నుంచి రాలేదు.
–జూనియర్‌ డాక్టర్లు 


ముఖ్యమంత్రి ఆదేశాలు..

  • సీనియర్‌ రెసిడెంట్ల గౌరవ వేతనాన్ని15 శాతం పెంచాలి.  
  • మూడేళ్ల వైద్య విద్య అభ్యసించి ‘కోవిడ్‌’వైద్య సేవల్లో కొనసాగుతున్న విద్యార్థులకు సైతం సీనియర్‌ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని అందించాలి. 
  • కోవిడ్‌ విధుల్లో మరణించిన వైద్యులకు ప్రభుత్వం ఇప్పటికే నిబంధనల మేరకుఎక్స్‌గ్రేషియాను అందిస్తున్న నేపథ్యంలో, జూడాల కోరిక మేరకు సత్వరమే చెల్లించాలి. 
  • జూడాలకు, వారి కుటుంబసభ్యులకు నిమ్స్‌లో అందిస్తున్న వైద్య సేవలను మరింత మెరుగుపరచాలి. 

స్తంభించిన వైద్య సేవలు

  • జూనియర్‌ డాక్టర్ల సమ్మెతో రాష్ట్రంలోని పలు ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో వైద్య సేవలు స్తంభించాయి.
  • సకాలంలో సేవలు అందక సాధారణ రోగులు ఇబ్బందిపడ్డారు.
  • క్లిష్టమైన ఈ సమయంలో మందులు, ఆక్సిజన్‌ మానిటరింగ్‌ చేసే వైద్యులు లేక కోవిడ్‌ బాధితులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.
  • కింగ్‌కోఠి ఆస్పత్రిలో సమ్మె చేస్తున్న జూనియర్‌ డాక్టర్లకు రోగుల బంధువులు మద్దతు పలికారు.  

ఇది సమయం కాదు
రాష్ట్రవ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్లు చేస్తున్న సమ్మెను వెంటనే విరమించాలి. లేని పక్షంలో చర్యలు తప్పవు. సమ్మె చేయడానికి ఇది సరైన సమయం కాదు. జూడాల సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
–మంత్రి కేటీఆర్‌
 

చదవండి: జూడాల సమస్యలను పరిష్కరించాలి

సమ్మె చేయడం మంచిది కాదు: సీఎం కేసీఆర్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు