కృష్ణమ్మ పరుగులు 

9 Aug, 2020 01:40 IST|Sakshi
ఎగువ నుంచి ఇన్‌ఫ్లో భారీగా పెరగడంతో జూరాల ప్రాజెక్టులో 28 క్రస్ట్‌గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్న దృశ్యం

ప్రాజెక్టులోకి 98,765 క్యూసెక్కుల ప్రవాహం 

ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌లోకి పెరుగుతున్న వరద 

ఈ వరదకు శ్రీశైలం, సాగర్, పులిచింతల నిండే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరుగు లు పెడుతోంది. ఎగువ నుంచి శనివారం సాయంత్రం 98,975 క్యూసెక్కులు చేరుతుండగా రాత్రి 12 గంటలకు ఇది రెండు లక్షల క్యూసెక్కులకు పెరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ దఫా వరదకు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నిండవచ్చని అంచనా వేస్తున్నాయి. 
► పశ్చిమ కనుమల్లో ప్రధానంగా కృష్ణా, ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సగటున 72 మి.మీ.ల వర్షపాతం పడింది. దాంతో కృష్ణా, ఉపనదుల్లో గంట గంటకూ వరద పెరుగుతోంది. 
► ఆల్మట్టిలోకి వరద పెరుగుతుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎంఏ) సూచనల మేరకు డ్యామ్‌ నీటినిల్వలను ఖాళీ చేసి దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ డ్యామ్‌లోనూ అదే పరిస్థితి. దాంతో జూరాలకు భారీగా వరద చేరుతోంది. జూరాల వరదను దిగువకు వదులుతున్నారు. 
►  శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు జలాలు విడుదల చేస్తుండటంతో నాగార్జునసాగర్‌ నీటిమట్టం 558.20 అడుగులకు చేరుకుంది. 
► అప్పర్‌ తుంగ, భద్ర డ్యామ్, సింగటలూరు బ్యారేజీ నుంచి భారీ వరదను దిగువకు వదులుతుండటంతో తుంగభద్రలోకి వరద ప్రవాహం పెరుగుతోంది. 
► పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, కిన్నెరసాని నుంచి నీటి ప్రవాహం చేరుతుండటంతో గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1.17 లక్షల క్యూసెక్కులు చేరుతుం డగా 7 వేల క్యూసెక్కులు డెల్టాకు, మిగిలిన 1.11 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

మరిన్ని వార్తలు