సమర్థుడు.. నిరాడంబరుడు

22 Oct, 2021 04:14 IST|Sakshi
జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ను సన్మానిస్తున్న దృశ్యం

జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌కు  హైకోర్టు సీజే సతీష్‌చంద్ర శర్మ ప్రశంస 

సాక్షి, హైదరాబాద్‌: జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ నిరాడంబరుడని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ కొనియాడారు. 2017లో ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైనప్పటి నుంచి బదిలీ అయ్యే వరకూ 87,957 కేసులు పరిష్కరించారని ప్రశంసించారు. ఇందులో 81,056 ప్రధాన పిటిషన్లు, 6,901 మధ్యంతర పిటిషన్లను ఉన్నాయని పేర్కొన్నారు. త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయిన జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌కు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ఫుల్‌కోర్టు గురువారం ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్ర శర్మ మాట్లాడుతూ, జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ తనకు అప్పగించిన పనిని సమర్థంగా పూర్తి చేసేవారని అన్నారు.  

న్యాయమూర్తిగా పనిచేసిన సమయంలో తనకు సహకరించిన అందరికీ జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ కృతజ్ఞతలు తెలిపారు. జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ ఇచ్చిన ఎన్నో తీర్పులు మైలురాయిలా నిలిచిపోతాయని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ కుటుంబ సభ్యులు, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సూర్యకరణ్‌రెడ్డి, అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.రాజేశ్వర్‌రావు, పీపీ ప్రతాప్‌రెడ్డి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్‌ పాల్గొన్నారు. అంతకు ముందు హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యవర్గం జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ను ఘనంగా సత్కరించింది.  కాగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ముంబై నుంచి బదిలీపై వస్తున్న జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు.

తెలంగాణ హైకోర్టుకు జస్టిస్‌ కన్నెగంటి లలిత 
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలితను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం గురువారం సిఫార్సు చేసింది. సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సెప్టెంబర్‌ 16న జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనిపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు