హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

18 May, 2022 01:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: రాష్ట్ర హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ను నియమించాలని సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో రెండో సీనియర్‌ న్యాయమూర్తిగా ఆయన కొనసాగుతున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం మంగళవారం సిఫార్సు చేసింది.

తెలంగాణ సహా ఐదు హైకోర్టులకు న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతులు కల్పించింది. కొలీజియం సిఫార్సులపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. 2021, అక్టోబర్‌ 11న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

1991లో బార్‌ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌..
జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌.. అసోంలోని గువాహటిలో 1964, ఆగస్టు 2న జన్మించారు. ఈయన తండ్రి సుచేంద్రనాథ్‌ సీనియర్‌ న్యాయవాదిగా, అసోం అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేశారు. ఉజ్జల్‌ భూయాన్‌ డాన్‌ బాస్కో స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. కాటన్‌ కాలేజీలో ప్లస్‌ టూ, ఢిల్లీలోని కిరోరి కళాశాలలో డిగ్రీ చదివారు. గువాహటి ప్రభుత్వ లా కాలేజీ నుంచి ఎల్‌ఎల్‌బీని, గౌహతి వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పట్టా అందుకున్నారు.

అసోం బార్‌ కౌన్సిల్‌లో 1991, మార్చి 20న పేరును నమోదు చేసుకున్నారు. పలు రాష్ట్రాల బార్‌ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌ చేసుకోవడమే కాకుండా పలు హైకోర్టుల్లో అడ్వొకేట్‌గా ప్రాక్టీస్‌ చేశారు. ఆదాయపు పన్ను స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా చాలా కాలం పనిచేశారు. 2010, సెప్టెంబర్‌ 6న సీనియర్‌ అడ్వొకేట్‌గా నియమితులయ్యారు.

అసోం అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌గా, గౌహతి హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సభ్యుడిగా, బార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడిగా కొనసాగారు. మిజోరాం రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా పనిచేశారు. గౌహతి హైకోర్టులో అడిషనల్‌ జడ్జిగా 2011, అక్టోబర్‌ 17న నియామకమయ్యారు. 2019, అక్టోబర్‌ 3న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ రెండేళ్లు జడ్జిగా సేవలందించారు. 2021, అక్టోబర్‌ 22న తెలంగాణ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కూడా భుయాన్‌ కొనసాగుతున్నారు.

మరిన్ని వార్తలు