ఇది బీసీలపై దాడే...

10 Aug, 2020 01:56 IST|Sakshi

అఖిల భారత బీసీ ఫెడరేషన్‌ ఫౌండర్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య

బలహీనవర్గాలు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండకూడదనే ఈ కుట్ర

జడ్జి రామకృష్ణతో నా సంభాషణను ఎడిట్, ట్యాంపర్‌ చేశారు

వాస్తవాలు వెల్లడవుతాయనే పూర్తి ఆడియో బయటపెట్టలేదు

ఏబీఎన్, ఆంధ్రజ్యోతి నేరపూరిత కుట్రతో వ్యవహరిస్తున్నాయి

న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయను, చేయబోను కూడా 

సాక్షి, హైదరాబాద్‌ : వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందాలన్న లక్ష్యంతోనే తాను పని చేస్తున్నానని, తన ప్రతి శ్వాస లోనూ బీసీ భావజాలమే ఉందని అఖిల భారత వెనుకబడిన వర్గాల ఫెడరేషన్‌ ఫౌండర్‌ చైర్మన్, హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య స్పష్టం చేశారు. బీసీలు, అణగారిన వర్గాల గొంతుకగా ఉన్న తనపై తప్పుడు కథనాలను ప్రచురిం చడం వెనుకబడిన వర్గాలపై దాడిగానే భావించాలన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడు తూ గత రెండు రోజులుగా తన  ఆత్మ గౌరవాన్ని కించపర్చేలా, బీసీల మనో భావాలను దెబ్బతీసే విధంగా ఆంధ్ర జ్యోతి, ఏబీఎన్‌ కల్పితాలు, కట్టుకథలతో కూడిన ఊహాజనితమైన వార్తలను అదేపనిగా ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
 
ఎడిట్, ట్యాంపర్‌ చేశారు..
– కొన్నాళ్లుగా సస్పెన్షన్‌లో ఉన్న జడ్జి రామకృష్ణను ఊరడించేందుకు మాత్రమే ఆయనతో మాట్లాడా.  నినా సంభాషణను ఎడిట్, ట్యాంపర్‌ చేశారు. వాస్తవాలు వెల్లడవుతాయనే పూర్తి ఆడియో బయట పెట్టలేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణను ఏబీఎన్, ఆంధ్రజ్యోతి తప్పుడు ఉద్దేశంతో బయట పెట్టి నేరపూరిత కుట్రతోవ్యవహరిస్తున్నాయి.
– నాకు రాజకీయాలతో సంబంధం లేదు. న్యాయవ్యవస్థతోపాటు అన్ని రంగాల్లో బీసీలకు సముచిత స్థానం లభించాలన్న ఆకాంక్షతో ముందుకు వెళ్తున్నా.
– బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిగా, సామాజిక న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా, బలహీన వర్గాలకు చెందిన జడ్జితో మాట్లాడిన సంభాషణను రికార్డు చేసి నా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా కుట్రపూరితంగా ట్యాంపరింగ్, ఎడిట్‌ చేసి ప్రసారం చేయడం ఆక్షేపణీయం.
 
బీసీలు జడ్జీలుగా తగరా?
– గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి... ఆంధ్రప్రదేశ్‌ జ్యుడీషియరీలో వారి జోక్యం గురించి నేను మాట్లాడిన దాన్ని వక్రీకరించి ఏబీఎన్‌ ప్రసారం చేసింది. వారి గురించి నేను మాట్లాడడం మొదటిసారి కాదు. మొదటి వ్యక్తిని కూడా కాదు. బీసీలు జడ్జిలుగా పనికిరారంటూ చంద్రబాబు, సదరు న్యాయమూర్తి రాసిన లేఖలపై గతంలో విశాఖపట్నంలో నేను మీడియా సమావేశం నిర్వహించి బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు జడ్జిలుగా ఎందుకు పనికిరారని ప్రశ్నించా. ఆనాటి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి విన్నవించా.
 
వాటిని చేర్చవలసిన చోటికి చేరుస్తా....
– రామకృష్ణతో సంభాషణ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సంబంధించిన కొంత సమాచారం ఆయన నాకు పంపించారు. ఈ విషయాన్ని నేను బయటకు వెల్లడించక ముందే జడ్జి రామకృష్ణ అభద్రతాభావానికిలోనై నా సంభాషణను రికార్డు చేసి ఏబీఎన్, ఆంధ్రజ్యోతికి ఇచ్చినట్లుగాభావిస్తున్నా. ఆ సంభాషణను ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ట్యాంపరింగ్, ఎడిట్‌ చేసి ప్రసారం చేసాయి. గౌరవ సుప్రీంకోర్టు జడ్జి మీద నేను చేసిన వ్యాఖ్యలు ఏవీ వినిపించకుండా ప్రసారం చేశారు.
రామకృష్ణ పంపించిన పత్రాలు, ఆధారాలు, సాక్ష్యాలు నా వద్ద భద్రంగా ఉన్నాయి. త్వరలో వాటిని చేర్చవలసిన చోటికి చేరుస్తా. 
 
ఆ పుస్తకంలోనూ ప్రస్తావించారు..
– గౌరవ న్యాయమూర్తికి సన్నిహితులు, వారి సమీప బంధువర్గానికి చెందిన దమ్మాలపాటి శ్రీనివాస్‌ ప్రైవేటు సంభాషణలను రికార్డు చేస్తే ప్రస్తుత సుప్రీంకోర్టు జడ్జి, శ్రీనివాస్‌ బినామీ ఆస్తులను కాపాడుకోవడానికి ఎలా పనిచేశారో, ఎలా లావాదేవీలు చేశారో తెలిసేది.  సదరు న్యాయమూర్తితో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి అవసరానికి మించి ఉన్న సాన్నిహిత్యంపై  ’క్యాస్ట్‌ క్యాప్చర్స్‌ ది ఇనిస్టిట్యూషన్స్‌’ పుస్తకంలో కూడా ఉంది. 

– విలేకరుల సమావేశంలో ఫెడరేషన్‌ మీడియా విభాగం చైర్మన్‌ వడ్డేపల్లి రామకృష్ణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు