జ్యోతిబా పూలే జయంతి: రచనలపై పోటీ, బహుమతులు

5 Apr, 2022 10:44 IST|Sakshi

మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా సాహిత్య రచనపై విద్యార్థుల్లో ఆసక్తి  రేకెత్తించే లక్ష్యం

బీసీ విద్యాసంస్థల విద్యార్థులకు తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో పోటీలు

మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ విద్యాసంస్థల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వ్యాస, కవిత, పద్య, చిత్రకళల్లో పోటీలు తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తామని బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. విద్యార్థుల్లో సాహిత్య సృజన పెంచేందుకు, జ్యోతి బా పూలే జీవిత ప్రభావం నేటి సమాజం పై ఎలా ఉంది అన్న విషయం తెలుసుకునేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన జ్యోతిబా పూలే గురించి ఆయన చేసిన సేవల గురించి ప్రతి ఒకరికీ తెలియజేస్తూ గడప గడపకి సాహిత్యాన్ని చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ పోటీలు  తెలంగాణ సాహిత్య అకాడమీతో కలిసి నిర్వహిస్తున్నామని బుర్రా వెంకటేశం వివరించారు.  

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని అన్ని విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు, తెలుగు ఉపాధ్యాయులు ఈ పోటీల్లో పాల్గొన్నవచ్చని వెంకటేశం చెప్పారు. ఆర్‌సీఓలు,  ప్రిన్సిపాల్స్, తెలుగు ఉపాధ్యాయులు విద్యార్థులకు ఈ విషయాలు చెప్పి వారిలో రచనాశక్తిని పెంపొందించాలని ఆయన సూచించారు.  ‘జ్యోతి బా పూలే జీవితం-నేటి సమాజం పై ప్రభావం’ అనే అంశంపై రెండుపేజీలకు మించకుండా వ్యాసం, పదికి మించకుండా పద్యాలు లేదా కవిత పంపాలన్నారు. అలాగే  చిత్రం వేయాలనుకున్నవారు ఏ4 సైజు పేపరు పై చిత్రం  గీసి పంపించాలని తెలిపారు. 

రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన ఉత్తమ రచనలకు ఏప్రిల్ 11న హైదరాబాద్ లో నిర్వహించే జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాల్లో బహుమతి ప్రదానం ఉంటుందని అన్నారు. గురుకుల విద్యార్థులతో పాటు హాస్టల్ విద్యార్థులు, టీచర్లు, వార్డన్లు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నవచ్చని ఆయన చెప్పారు.  అలాగే  తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఈ పోటీల్లో వచ్చిన వాటిల్లో అత్యుత్తమైనవి ఎంపిక చేసి పుస్తకంగా తీసుకురానున్నట్టు బుర్రా వెంకటేశం వెల్లడించారు.

మరిన్ని వార్తలు