డ్రోన్‌ టెక్నాలజీలో గ్లోబల్‌ హబ్‌గా భారత్‌ 

12 Sep, 2021 03:11 IST|Sakshi

కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా 

వరంగల్, ఆదిలాబాద్‌లో బ్రౌన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలు 

సాక్షి, హైదరాబాద్‌:  విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. డ్రోన్‌ టెక్నాలజీని అభివృద్ధి పరుస్తూ కీలక రంగాల్లో వినియోగిస్తున్నట్లు చెప్పారు. అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన ఆయన శనివారం సాయంత్రం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. డ్రోన్‌ టెక్నాలజీలో భారత్‌ గ్లోబల్‌ హబ్‌గా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఔషధ సరఫరాకు డ్రోన్లను వినియోగించడం గొప్ప మార్పు అని, దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు.

విమానయాన రంగంలో డిజిటల్‌ ఎయిర్‌ స్పేస్‌ మ్యాప్‌ ద్వారా అనుమతులను సులభతరం చేసినట్లు చెప్పారు. భవిష్యత్‌లో ‘ఓలా ట్యాక్సీ’ తరహాలో ఎయిర్‌ ట్యాక్సీలు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. హైదరాబాద్‌ విమానాశ్రయాన్ని విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. బేగంపేటలోని పాత విమాశ్రయాన్ని కూడా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. వరంగల్, ఆదిలాబాద్‌లో బ్రౌన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేయబోతున్నట్లు పేర్కొన్నారు.

జక్రాన్‌పల్లిలో కూడా ఎయిర్‌పోర్టుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. తిరుపతి, గన్నవరం విమానాశ్రయాలను ప్రైవేటుపరం చేస్తున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా, దేశంలో విమాన రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కొన్ని విమానాశ్రయాలను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు మాత్రమే ఇస్తున్నట్లు చెప్పారు.

టీఆర్‌ఎస్‌తో రాజకీయ పోరాటం  
అధికారిక పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌తో భేటీకావడం మర్యాదపూర్వకమేనని జ్యోతిరాదిత్య స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాలే కేసీఆర్‌తోనూ ఉన్నాయన్నారు. కేంద్రమంత్రులు ప్రధాని విజన్‌ను అమలు చేసేందుకు ప్రయత్నిస్తారని.. దానికి, రాజకీయాలకు సంబంధం లేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. టీఆర్‌ఎస్‌తో బీజేపీ రాజకీయ పోరాటం కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ బలమైనరాజకీయ శక్తిగా మారనుందన్నారు.

మరిన్ని వార్తలు