హామీల అమలుపైనే..

2 Aug, 2021 00:59 IST|Sakshi

నాగార్జున సాగర్‌  నియోజకవర్గ ప్రగతి సమీక్షలో దృష్టి పెట్టనున్న కేసీఆర్‌ 

నేడు హాలియాకు సీఎం రాక 

సాగర్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఇతర అంశాలపై చర్చ

కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ నియోజకవర్గ పరిధిలోని హాలియా పట్టణానికి రానున్నారు. ఉదయం 10 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి బయలుదేరనున్న ఆయన హెలికాప్టర్‌లో 10:40 గంటలకు హాలియా చేరుకుంటారు స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో జరగనున్న సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు. నియోజకవర్గ అభివృద్ధి, సాగర్‌ ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పురోగతే ప్రధాన ఎజెండాగా ఈ సమీక్ష జరగనుంది. స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్‌ నివాసంలో భోజనానంతరం మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి మొత్తం మీద మూడున్నర గంటల పాటు హాలియాలో గడపనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

ఎత్తిపోతల పథకాలపై ప్రధాన చర్చ 
సాగర్‌ ఉప ఎన్నికల సమయంలో తాను ఇచ్చినnal హామీల అమలు, వాటి పురోగతితో పాటు ఇంకా ప్రారంభించాల్సిన పనులకు సంబంధించిన కార్యాచరణపై జిల్లా యంత్రాంగానికి కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా నియోజకవర్గంలో ఇప్పటికే శంకుస్థాపన చేసిన నెల్లికల్లు ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి జిల్లాలోని మరో 15 ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులను కూడా ఆయన సమీక్షించనున్నారు. ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు ద్వారా పాలేరు రిజర్వాయర్‌ నుంచి గోదావరి నీటిని దిగువన ఉన్న త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు అనుసంధానం చేసే అంశంపైనా సీఎం సమీక్షిస్తారని తెలుస్తోంది. అలాగే ఉమ్మడి జిల్లాలోని గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్‌) కింద మంజూరు చేసిన రూ.199 కోట్లతో చేపట్టాల్సిన పనుల గురించి కూడా సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని జిల్లా అధికార వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు