కీసర ఇంచార్జ్‌ తహశీల్దార్‌గా గౌతమ్‌ కుమార్‌

17 Aug, 2020 21:39 IST|Sakshi
నాగరాజు లంచం కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

సాక్షి, మేడ్చల్: కీసర మండలం ఇంచార్జ్ తహశీల్దార్‌గా కె.గౌతమ్ కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తొలుత గీతను కీసర ఇంచార్జ్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అయితే జ్వరంతో బాధపడుతున్న ఆమె బాధ్యతలు స్వీరించేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఆ స్థానంలో గౌతమ్‌కుమార్‌ను నియమించారు. ఇక కీసర ఎమ్మార్వోగా ఉన్న నాగరాజు భూవివాదం కేసులో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారుకులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. కోటి పది లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ చేతికి చిక్కారు. (కీసర ఎమ్మార్వో నాగరాజు కేసులో కొత్త కోణం!)

కొనసాగుతున్న దర్యాప్తు
ఇదిలా ఉండగా.. అవినీతి తిమింగలం కీసర ఎమ్మార్వో నాగరాజు లంచం కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. స్థిరాస్తి వ్యాపారులు అంజిరెడ్డి, శ్రీనాథ్, యుగేందర్ ఇంట్లో, కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా రియల్టర్‌ అంజిరెడ్డి వద్ద ఏసీబీ సోదాల్లో రేవంత్‌రెడ్డి ఎంపీ లాడ్స్ నిధుల ఫైళ్లు లభ్యమైనట్టు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అదే విధంగా కలెక్టర్ ఆఫీసులో ఉండాల్సిన పలు పత్రాలు కూడా అంజిరెడ్డి వద్ద లభ్యమమైన నేపథ్యంలో నాగరాజు కేసుపై లోతుగా విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు