కే4 పులికి ఒంట్లో బాగోలేదా.. ?

7 Sep, 2020 07:53 IST|Sakshi
భీమారం అడవుల్లో సంచరిస్తున్న కే4 పెద్దపులి (ఫైల్‌)

వేటాడి ఆహారం అందిస్తున్న ఏ1 పులి

బిగుస్తున్న ఉచ్చుతో ఇబ్బందులు 

పరుగెత్తడం, వేటాడటం మానేసిన వైనం

జంటగా సంచరిస్తున్న పెద్ద పులులు

కాజిపల్లి అడవుల్లో రెండు పశువులను చంపిన ఏ1 

భయపడుతున్న పశువుల కాపరులు 

సాక్షి, భీమారం(చెన్నూర్‌): రెండేళ్లుగా భీమారం, చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని అడవుల్లో సంచరిస్తూ పశువులపై దాడి చేసి హతమార్చిన కే4 పెద్దపులి ఆరోగ్యం వేటకు సహకరించట్లేదు. దీంతో మరో పులి దానికి ఆహారం అందిస్తోంది. శనివారం భీమారం మండలంలోని కాజిపల్లి అడవుల్లో మేత కోసం వెళ్లిన పశువుల మందపై దాడి చేసిన సమయంలో రెండు పెద్ద పులులు ఉన్నాయని పశువుల కాపరులు పేర్కొనడంతో అటవీశాఖ అధికారుల అనుమానాలు నిజమయ్యాయి.

రెండేళ్ల క్రితం ఈప్రాంతానికి వచ్చిన  ఆడపులికి వేటగాళ్లు అమర్చిన ఇనుపవైర్లు శరీరం చుట్టూ ఉండి తీవ్ర గాయాలయ్యాయి. పులి ఉచ్చుని తొలగించేందుకు అటవీశాఖ తీసుకున్న చర్యలు ఫలించలేదు. పెద్దపులిని బంధించి దానికి ఉన్న ఇనుప వైర్లు తొలగించేందుకు అడవుల్లో బోన్లు ఏర్పాటు చేసి ఎరగా దూడలు కట్టేసి ఉంచినా అధికారుల పాచికలు పారలేదు. అనేక నెలల పాటు ఈ ఆపరేషన్‌ నిర్వహించినా పులి చిక్కలేదు. దీంతో పులికి చికిత్స చేయించాలనే ఆలోచనని అటవీశాఖ పక్కకు పెట్టింది. (భూపాలపల్లి అడవుల్లో మగ పులి) 

గొల్లవాగు ప్రాజెక్ట్‌ కేంద్రంగా
భీమారం సమీపంలోని గుట్టల మధ్య నిర్మించిన గొల్లవాగు ప్రాజెక్ట్‌  నీటివనరులు పెద్దపులికి అనుకూలంగా మారాయి. ప్రాజెక్ట్‌కు అతి సమీపంలో ఉన్న పులిఒర్రెలో పెద్దపులి నివాసం ఏర్పర్చుకొని  అక్కడనుంచి చెన్నూర్‌ మండలం బుద్దారం, కోటపల్లి మండలంలోని అడవుల్లో సంచరిస్తోంది. అయితే సంవత్సరం క్రితం వచ్చిన మగపులి  ఆడపులిని అక్కున చేర్చుకుంది. కొన్నాళ్ల పాటు రెండు వేర్వేరుగా తిరిగి వచ్చి ఆవాసానికి చేరుకునేవి. ప్రతిరోజు వేర్వేరుగా ఆహారం వేటాడి తినేవి. రెండు నెలల క్రితం ఏ2 మగపులి మరొకటి ఈప్రాంతానికి వచ్చినా ఆవాసం లభించకపోవడంతో తిరిగి వెళ్లిపోయింది.

క్షీణిస్తున్న ఆరోగ్యం
ఆడపులి శరీరం చుట్టూ ఉన్న ఇనుప వైరు కారణంగా అది ఇంతవరకూ గర్భం దాల్చడం లేదని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఆరునెలల నుంచి కే4 ఆడపులి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం ఆహారం కోసం వేట కూడా చేయలేని స్థితికి అది చేరుకుంది.

తోడుగా ఏ1.. 
క్షీణిస్తున్న ఆరోగ్యంతో వేటాడలేని పరిస్థితుల్లో ఉన్న ఆడపులికి మగ పులి తోడుగా ఉంటూ అడవిజంతువులతో పాటు పశువులపై దాడి చేసి ఆహారం అందిస్తుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు.  కాజిపల్లి వద్ద రెండు పశువులను చంపిన పులి వెంట ఉన్న దానికి  మరొక దానిని అప్పగించిందని వారు తెలిపారు.

దాడి తరువాత భీమారానికి
కాజిపల్లి వద్ద రెండు గేదెలను హతమార్చిన పులులు సాయంత్రం గొల్లవాగు ప్రాజక్ట్‌ సమీపంలోని వాగుకి వచ్చాయని చేపల వేటకు వెళ్లిన వారు పేర్కొన్నారు. చేపలు పడుతుండగా పులుల గాండ్రింపులు వినబడ్డాయని.. దాంతో పరుగెత్తుంటూ గ్రామానికి చేరుకున్నామని తెలిపారు. 

భయంభయం
గతంలో వేర్వేరుగా సంచరించిన పులులు ఇప్పుడు జతకట్టి తిరుగుతుండటంతో భీమారం, నర్సింగాపూర్, కాజిపల్లి తదితర గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. గ్రామానికి కిలోమీటరు దూరంలోనే అడవి ఉంటుందని పశువులను ప్రతి రోజూ అడవికి పంపిస్తుంటామని ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు