‘వర్క్‌ మెన్‌ స్పెషల్‌’ నమునా రైలు 

27 Aug, 2020 10:57 IST|Sakshi
మనోహరాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద రైల్వే అధికారులతో మాట్లాడుతున్న జెడ్పీ చైర్‌ పర్సన్, ఎలక్షన్‌రెడ్డి

సాక్షి, గజ్వేల్: ‘కరోనా దెబ్బ’ ప్రభావం కారణంగా గజ్వేల్‌కు రావాల్సిన రెగ్యులర్‌ ప్యాసింజర్‌  రైలు పట్టాలు ఎక్కే వ్యవహారంపై పెండింగ్‌లో పడుతూ వస్తోంది. ఇప్పటికే మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు 33 కిలోమీటర్ల మేర రైల్వేలైన్‌ పనులు పూర్తి కాగా రెండు నెలల క్రితం కమిషన్‌ ఆఫ్‌ రైల్వే సెఫ్టీ (సీఆర్‌ఎస్‌) క్రితం కమిషన్‌ ఆఫ్‌ రైల్వే సెఫ్టీ (సీఆర్‌ఎస్‌) తనిఖీలు విజయవంతంగా పూర్తయిన విషయం కూడా విధితమే. ఈ నేపథ్యంలోనే సీఆర్‌ఎస్‌ తనిఖీలు పూర్తయిన మూడు నెలల్లోపు రైలును పట్టాలెక్కించాలనే ఆనవాయితీలో భాగంగా.. బుధవారం దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌ సదర్మ దేవరాయ పర్యవేక్షణలో కాచిగూడ– మల్కాజిగిరి– మేడ్చల్‌– మనోహరాబాద్‌ గజ్వేల్‌కు వరకు రైలును నమునాగా పట్టాలపై ఎక్కించారు. అదే విధంగా లైన్‌ను మరోసారి పరిశీలించారు. ‘వర్క్‌ మెన్‌ స్పెషల్‌’  పేరిట రైలు పట్టాలపై పరుగులు తీసింది. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ నుంచి కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల పొడవున ఈ న్యూబ్రాడ్‌గేజ్‌ లైన్‌  నిర్మాణం జరుగుతుండగా..రూ.1160.47కోట్లను వెచ్చిస్తున్నారు.

ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో ఈ రైల్వేలైన్‌ కీలక మలుపుగా మారనుంది. కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్ళడానికి ఇప్పటి వరకు రోడ్డు మార్గమే ఆధారం. ఈ రైల్వేలైన్‌ పూర్తయితే ప్రయాణం ఇక సులువు కానుంది. మొత్తం ఈ లైన్‌ కోసం మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల పరిధిలో 2020 ఎకరాల భూసేకరణ జరిగింది. ఇది సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి మనోహరాబాద్‌ మీదుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్‌ ట్రంక్‌ లైన్‌తో అనుసంధానం కానుంది. ఫలితంగా ఈ లైన్‌ హైదరాబాద్, న్యూఢిల్లీ, కలకత్తా లాంటి మహానగరాలను కలుపుతూ జాతీయ లైన్‌గా ఆవిర్భవించనుంది.. పెద్దపల్లి గ్రాండ్‌ ట్రంక్‌లైన్‌కు ఇప్పటి వరకు సికింద్రాబాద్, ఖాజీపేట మార్గం అనుసంధానంగా ఉండేది. మనోహరాబాద్‌– కొత్తపల్లి రైల్వేలైన్‌  పూర్తయితే.. ప్రయాణీకులకు దూరభారం తగ్గనుంది. మనోహరాబాద్‌ నుంచి సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ వరకు 33 కిలోమీటర్ల రైల్వేలైన్‌ పనులు పూర్తయ్యాయి. లైన్‌లపై ఉన్న వంతెన పనులను పూర్తి చేశారు.

మనోహరాబాద్‌ దాటిన తర్వాత నాగ్‌పూర్‌ జాతీయ రహదారిని ఈ రైల్వేలైన్‌ దాటేందుకు చేపడుతున్న పూర్తయిన ఆర్‌ఓబీ పనులు.. గతంలో  రైల్వే సేఫ్టీ కమిషనర్‌ రామ్‌క్రిపాల్‌ రైల్వే ఇంజినీర్ల బృందంతో కలిసి జూన్‌ 18న తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల తర్వాత మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు రైలు నడపడానికి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుందని భావిస్తున్న తరుణంలో.. “కరోనా’ ఉధృతి కారణంగా రైలు నడిపే అంశం వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే జూన్‌ 28న మనోహరాబాద్‌ మండలం రామాయపల్లి అండర్‌పాస్‌ వద్ధ రైల్వే ట్రాక్‌ కట్ట వర్షాలకు దెబ్బతింది. కొంత మేర ట్రాక్‌ కంకర, మట్టి కొట్టుకుపోయి లైన్‌ ధ్వంసమైంది. ఈ ఘటన రైల్వే శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన కూడా రైలు నడపడానికి అవరోధంగా మారింది.  

‘వర్క్‌ మెన్‌ స్పెషల్‌’ పేరిట నమునా రైలు 
సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ ప్రాంతానికి రైలు నడపటం వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వస్తున్న అంశంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు  రైల్వే అధికారులతో ఈనెల 22న హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో సమీక్షించారు. నిజానికి కమిషన్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ పరిశీలనలు పూర్తయిన తర్వాత కొద్ది రోజులకు రైలు నడపాలి. కానీ కరోనా వల్ల ఈ వ్యవహారం వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గేంతవరకు పాక్షికంగా నమునాగా “వర్క్‌ మెన్‌ స్పెషల్‌’ పేరిట నమూనా రైలును నడపటానికి నిర్ణయించారు. ఈ క్రమంలోనే బుధవారం దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌ సదర్మ దేవరాయ పర్యవేక్షణలో కాచిగూడ–మల్కాజిగిరి–అల్వాల్‌–మెడ్చేల్‌– నుంచి వయా మనోహరాబాద్‌ మీదుగా గజ్వేల్‌ వరకు రైలును నడిపారు. మొత్తంగా 83కిలోమీటర్ల రైలు అప్‌ అండ్‌ డౌన్‌ పరుగులు తీసింది. ఇందులో రైల్వే సిబ్బందితోపాటు సాధారణ ప్రజలు కూడా ఎక్కారు. అంతేకాకుండా రైల్వే లైన్‌ను మరోసారి పరిశీలన జరిపారు. ఒక రకంగా ఈ ప్రక్రియ గజ్వేల్‌కు రైలును నడిపినట్లయ్యింది. రెగ్యులర్‌ ప్యాసింజర్‌ రైలును మాత్రం కరోనా ప్రభావం తగ్గాకే అనుమతి ఇవ్వనున్నారు.  ఈ అంశాన్ని గజ్వేల్‌ ప్రాంతంలో రైల్వేలైన్‌ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీర్‌ జనార్థన్‌ ధృవీకరించారు.    

మరిన్ని వార్తలు