అటవీశాఖ అధికారులపై గ్రామస్తుల దాడి 

2 Mar, 2022 02:12 IST|Sakshi
చికిత్స పొందుతున్న ఎఫ్‌బీవో శిరీష 

గర్భిణీ అయిన ఎఫ్‌బీవోకు అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక

కాగజ్‌నగర్‌టౌన్‌: కాగజ్‌నగర్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ అటవీ అధికారులపై దాడి జరిగింది. తప్పించుకునే క్రమంలో పరుగెడుతూ 8 నెలల గర్భిణీ అయిన ఎఫ్‌బీవో అస్వస్థతకు గురయ్యారు. కాగజ్‌నగర్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆధ్వర్యంలో అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించడం కోసం కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం ఊట్‌పల్లిలో మంగళవారం కళాజాత నిర్వహించారు. వంట చెరుకును తీసుకోనివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారని, గొడ్డళ్లు, సైకిళ్లను స్వాధీనం చేసుకుంటున్నారని అధికారులను గ్రామస్తులు ఘెరావ్‌ చేశారు.

దీంతో కళాజాత బృందం సభ్యులు అర్ధాంతరంగా కార్యక్రమాలను ఆపేసి వెళ్లిపోయారు. కోసిని ఎఫ్‌బీవో శిరీష, వాచ్‌మేన్‌లు దేవ్‌సింగ్, రాములు, శంకర్‌ తమ ద్విచక్ర వాహనాలపై బయల్దేరుతుండగా గ్రామస్తులు అడ్డుకొని కర్రలతో దాడికి దిగారు. శిరీష ఎడమ చేతికి గాయాలయ్యాయి. దాడి నుంచి తప్పించుకోవడానికి పరుగెత్తడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న శిరీష భర్త బైక్‌పై ఆమెను పట్టణంలోని ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం అటునుంచి ఆమెను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు