వరంగల్‌ గడ్డపై అడుగుపెట్టిన కాకతీయ వంశ 22వ వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌

7 Jul, 2022 12:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓరుగల్లు కేంద్రంగా రాజ్యపాలన సాగించిన కాకతీయ రాజులు ప్రజల మెరుగైన జీవనం కోసం తెచ్చిన పథకాలు, చేపట్టిన నిర్మాణాలు ఇప్పటికీ ఆదర్శనీయమే. ఈ నేపథ్యంలో తమ పూర్వీకులు పాలించిన ప్రాంతాన్ని 700 ఏళ్ల తరువాత కాకతీయ వంశానికి చెందిన 22వ మహారాజు కమల్‌చంద్ర బంజ్‌దేవ్‌ దర్శించుకోనున్నారు. నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘కాకతీయ వైభవ సప్తాహం’ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఇందులో భాగంగా బంజ్‌దేవ్‌ గురువారం ఉదయం వరంగల్‌కు విచ్చేసి భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు.  తమ వంశ‌స్థుల గ‌డ్డ‌కు రావ‌డం సంతోషంగా ఉంద‌ని భంజ్‌దేవ్ తెలిపారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డ‌మే మా ల‌క్ష్యం అని పేర్కొన్నారు. త‌న‌ను ఆహ్వానించిన నాయ‌కుల‌కు క‌మ‌ల్ చంద్ర భంజ్‌దేవ్ ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు చెప్పారువరంగల్‌ రాకపై  ‘సాక్షి’ ప్రత్యేకంగా మహారాజుతో ముచ్చటించింది. పూర్వీకులు సాగించిన పాలన, ఓరుగల్లు వైభవం గురించి ఆయన అభిప్రాయాలు తెలుసుకుంది. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

తల్లి చెంతకు చేరుకున్నట్లు ఉంది...
కాకతీయ వంశ వారసునిగా ఓరుగల్లును సందర్శించే అవకాశం రానుండటం చూస్తుంటే తిరిగి నా తల్లి చెంతకు చేరుకున్నట్లు అనిపిస్తోంది. మాటల్లో చెప్పలేని ఆనందంతో మనస్సు నిండిపోయింది. వరంగల్‌ ప్రజలతో వీడదీయరాని ఆత్మీయ సంబంధం ఎప్పటికీ ఉంటుంది. వరంగల్‌ గురించి, కాకతీయ వైభవం గురించి నాకు ఎప్పటి నుంచో అవగాహన ఉంది. నేను ఉన్నతవిద్య కోసం లండన్‌ వెళ్లా. మాస్టర్స్‌ ఇన్‌ ఇంటర్నేషనల్‌ సైన్స్, మాస్టర్స్‌ ఇన్‌ పొలిటికల్‌ సైన్స్‌ పూర్తి చేశా. 2009లో తిరిగి భారత్‌కు వచ్చా. ఇప్పుడు నా మూలాలను వెతుక్కుంటూ మళ్లీ ఓరుగల్లుకు వస్తున్నా.


విద్యుత్‌ దీపాల వెలుగుల్లో హనుమకొండ కలెక్టర్‌ కార్యాలయం

ప్రజాపాలన సాగించింది మా పూర్వీకులే...
రాచరిక చరిత్రలో ప్రజాపరిపాలన సాగించింది కేవలం కాకతీయులు మాత్రమే. మా పూర్వీకులు ప్రజల కోసం ఎన్నో బహుళార్ధ ప్రాజెక్టులు, నిర్మాణాలు, చారిత్రక కట్టడాలు నిర్మించారు. అందుకే ప్రజలు మా వంశీయులని రాజుగా కాకుండా దేవుడిగా చూస్తారు. కాకతీయ రాజుగా ఉన్నందుకు గర్విస్తున్నాను. వరంగల్‌ ప్రజలు ఎప్పుడూ నా వాళ్లే. వారి కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం. తెలంగాణలోని టార్చ్‌ ఎన్‌జీఓ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేయనున్నా. కాకతీయ సంస్కృతిని పరిరక్షించి భావి తరాలకు అందించాల్సిన అవసరముంది. కాకతీయ గత వైభవానికి సంబంధించిన సమాచారాన్ని గ్రంథస్తం చేస్తా. 

బస్తర్‌ కేంద్రంగానే కాకతీయుల పాలన...
బస్తర్‌ వేదికగా రాజ్య పరిపాలన ప్రారంభించింది కాకతీయ రాజులే. 22 తరాలుగా మా వంశీయులు కాకతీయ మూలాలతోనే రాజ్య పరిపాలన చేశారు. మేము కాకతీయ రాజులమేనని పలు శాసనాల్లో ఆధారాలున్నాయి. నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం విడుదల చేసిన మెమొరాండం ఆఫ్‌ ది ఇండియన్‌ స్టేట్స్‌ పుస్తకంలో కూడా మేము కాకతీయ రాజులమేనని ప్రస్తావించింది. బస్తర్‌ వేదికగా ఉన్న పలు శాసనాల్లో కూడా మా వంశం గురించి పొందుపరిచారు. నేటికీ మా సామ్రాజ్యం బస్తర్‌లో విస్తరించి ఉంది. నేను జగదల్‌పూర్‌లో ఉన్న కోటలో ఉంటున్నా.

అన్ని ఆయుధాలూ వాడగలను..
నాకు అన్ని రకాల ఆయుధాలు వాడటంలో ప్రావీ ణ్యముంది. గోల్ఫ్, ఆర్చరీ, పోలో ఆడతాను. ఫైరింగ్‌ అంటే ఇష్టం. నేను శాకాహారిని, మద్యపానం అలవాటులేదు. ఇప్పటికీ నా చిన్ననాటి స్నేహితులతో కలుస్తుంటా. అందులో సామాన్యులు ఉన్నారు.. ఐఏఎస్, ఐపీఎస్, రాజకీయ నాయకులూ ఉన్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు..
కాకతీయ వైభవ సప్తహం కార్యక్రమాలకు నన్ను ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. జగదల్‌పూర్‌లోని నా ప్యాలెస్‌కి వచ్చి ప్రత్యేకంగా ఆహ్వానించిన చీఫ్‌ విప్‌ దాస్య వినయ్‌ భాస్కర్, తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణకు ప్రత్యేక ధన్యావాదాలు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు