లక్ష్మీ పంపుహౌస్‌లో బయటపడిన మోటార్లు! 28 రోజుల తర్వాత

12 Aug, 2022 02:14 IST|Sakshi
లక్ష్మీపంపుహౌస్‌లో ధ్వంసమైన మోటార్లు 

నీట మునిగిన 28 రోజుల తర్వాత బయటికి వచ్చిన ఫొటోలు

మరమ్మతులకు ఏర్పాట్లు చేస్తున్న ఇంజనీర్లు

కాళేశ్వరం: భారీ వర్షాలు, గోదావరి వరదతో నీట మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీ పంపుహౌస్‌లో మోటార్లు పైకి తేలాయి. నిజానికి పంపుహౌస్‌ నీట మునిగినప్పటి నుంచీ మీడియాను, బయటి వ్యక్తులెవరినీ అనుమతించ డం లేదు. పరి స్థితి ఏమిటన్న ది గోప్యంగా ఉంచారు. అయి తే మోటార్లు, పంపులు నీటి లోంచి బయటికి తేలిన, దెబ్బతిన్న వీడి యోలు గురువారం బయటికి వచ్చాయి. అధికారులు ఈ నెల 6వ తేదీ నాటికి నీటిని తోడేసే పని పూర్తయిందని, బురద తొలగింపు, క్లీనింగ్‌ పనులు చేస్తున్నారని తెలిసింది.

అతి భారీ వరదతో..
చరిత్రలో ఎన్నడూ లేనంతగా గత నెల 14న గోదావరి, ప్రాణ హిత నదులు ఉగ్రరూపం దాల్చి.. కాళేశ్వరం వద్ద 16.90 మీటర్ల ఎత్తులో, 28.90 లక్షల క్యూసెక్కుల భారీ ప్రవాహం నమోదైన విషయం తెలిసిందే. దీనితో అప్రోచ్‌ కెనాల్‌ నుంచి వచ్చిన వరద హెడ్‌ రెగ్యులేటరీ గేట్ల లీకేజీ కారణంగా ఒక్కసారిగా ఫోర్‌బేకు చేరింది. ఈ ఒత్తిడికి ఫోర్‌బే రిజర్వాయర్‌కు, పంపుహౌస్‌కు మధ్య ఉన్న బ్రెస్ట్‌ వాల్‌ (రక్షణ గోడ) కూలిపోయి మోటార్లు, పంపులపై పడింది.

అదే సమయంలో పైన బరువులు ఎత్తేందుకు అమర్చిన 220 టన్నుల బరువైన రెండు ఈఓటీ క్రేన్‌లు, రెండు లిఫ్ట్‌లు, రెండు ఫుట్‌పాత్‌ ఐరన్‌ నిచ్చెనలు విరిగిపడ్డాయి. దీంతో ఆరు మోటార్లు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలిసింది. ఈ మోటార్లను విదేశాల నుంచి ఆయా సంస్థల ఇంజనీర్లు వచ్చి పరిశీలించాల్సి ఉంది. అయితే పూర్తిగా దెబ్బతిన్న ఆరు మోటార్ల స్థానంలో కొత్తవి అమర్చాలని.. మిగతా వాటికి మరమ్మతులు అవసరమని రాష్ట్ర ఇంజనీర్లు ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇక వరదలు తగ్గుముఖం పడితే రక్షణ గోడ నిర్మాణానికి అనువుగా ఉంటుందని ఇంజనీర్లు భావిస్తున్నారని.. రక్షణ గోడను పంపుహౌస్‌ పొడవునా నిర్మించేందుకు డిజైన్లు సిద్ధం చేస్తున్నారని తెలిసింది. 

మరిన్ని వార్తలు