కాళేశ్వరానికి సాయమేది?

9 Nov, 2021 02:35 IST|Sakshi

ప్రాజెక్టును ఏఐబీపీ కింద చేర్చడంపై కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు 

ఈ పథకంలో చేరుస్తామంటూ ఆరు నెలల కిందే రాష్ట్రానికి సంకేతాలు 

ఇప్పటివరకూ కేంద్రం నుంచి సమాధానం శూన్యం 

ఇప్పటికే ప్రాజెక్టు కోసం 80 శాతం నిధులు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు ముగింపు దశకు చేరుకుంటున్నా.. కేంద్రం నుంచి దక్కే ఆర్థిక సాయం మాత్రం తేలేలా లేదు. ఈ ప్రాజెక్టును సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ)లో చేరుస్తామంటూ ఆరు నెలల కిందటే కేంద్రం సంకేతాలు ఇచ్చినా దీనిపై మళ్లీ ఊసే లేదు. అడపాదడపా ప్రాజెక్టుకు ఉన్న అనుమతులు, ఇతర అంశాలపై లేఖలు రాస్తున్నా.. ఇంతవరకు నయాపైసా విదల్చలేదు. దీంతో కేంద్ర నిధులపై రాష్ట్రం ఆశలు పూర్తిగా నీరుగారినట్లే కన్పిస్తున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశం ఎటూ తేలకపోవడంతో కనీసం ఏఐబీపీ పథకంలోనైనా చేర్చి ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల కిందట కేంద్రాన్ని కోరింది. అప్పట్లోనే ప్రాజెక్టు డీపీఆర్‌ సమర్పించింది. గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీలను తీసుకుంటూ రూ.80,190 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్లు వివరించింది. ఏఐబీపీలో ప్రాజెక్టును చేర్చాలని కోరే నాటికే ప్రాజెక్టు కింద సుమారు రూ.50 వేల కోట్ల మేర నిధులు ఖర్చు చేశామని, మిగతా నిధుల అవసరాలకు సాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.

ఈ ఏడాది మేలో ఏఐబీపీ పథకాన్ని 2026 వరకు పొడిగిస్తున్నట్లు నిర్ణయించి, అందులో కాళేశ్వరాన్ని చేర్చేందుకు సద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ప్రాజెక్టు సమగ్ర వివరాలు కోరింది. దీంతో ఆ వివరాలను మరోసారి కేంద్రానికి పంపింది. దీనిపై పలుసార్లు పర్యావరణ, అటవీ అనుమతులు, టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) అనుమతులు, కాస్ట్‌ అప్రైజల్‌ అనుమతులు, భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ వివరాలు కోరగా, వాటినీ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది.

ఈ అన్ని అంశాలపై సమగ్ర పరిశీలన చేసిన కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిధిలోని మానిటరింగ్‌ అండ్‌ అప్రైజల్‌ డైరెక్టరేట్‌ ప్రాజెక్టును ఏఐబీపీలో చేర్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయంటూ కేంద్రానికి నివేదించింది. తర్వాత కూడా ప్రాజెక్టుపై చేసిన వ్యయం, రానున్న ఆర్థిక సంవత్సరాల్లో ప్రాజెక్టుపై వెచ్చించేందుకు నిర్ణయించిన బడ్జెట్‌పై వివరణలు కోరింది. ఇన్ని వివరాలు అడిగినా ఇప్పటివరకు ప్రాజెక్టును ఏఐబీపీలో చేరుస్తున్నట్లు కేంద్రం ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు. 

అదనపు టీఎంసీ పనులకు కష్టమే.. 
ప్రాజెక్టు విస్తరణలో భాగంగా రూ.30 వేల కోట్లతో చేపట్టిన అదనపు టీఎంసీ పనులను ఏఐబీపీలో చేర్చాలని కోరుదామంటే, ఈ పనులన్నీ కొత్తగా చేపట్టినవని, వీటికి అపెక్స్‌ కౌన్సిల్‌ సహా, బోర్డుల అనుమతులు ఉండాలని కేంద్రం పేర్కొంటోంది. 

ఇప్పుడు చేర్చినా ఫలితం కొంతే.. 
కాళేశ్వరం మొత్తం వ్యయం రూ.80 వేల కోట్లలో ఇప్పటికే ప్రభుత్వం రూ.68 వేల కోట్ల మేర ఖర్చు చేసింది. ఈ నిధుల కోసం రుణ సంస్థల నుంచి నిధులు సేకరించింది. రుణాల ద్వారా సేకరించిన వాటి నుంచే రూ.45 వేల కోట్ల వరకు ఖర్చు జరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టును ఏఐబీపీలో చేర్చినా పెద్దగా ఫలితం ఉండదని చెబుతున్నారు. మిగిలిన రూ.12 వేల కోట్ల పనుల్లో ఏఐబీపీ కింద కేంద్రం గరిష్టంగా రూ.3–5 వేల కోట్లు ఇచ్చినా.. ఆ నిధులతో ప్రాజెక్టుకు ఒరిగే ప్రయోజం ఏమీ ఉండదు. పైగా ఈ నిధులు ఇచ్చేందుకు కూడా కేంద్రం రెండు, మూడేళ్లు గడువు పెడుతోంది. అప్పట్లోగా ప్రాజెక్టు పనులన్నీ పూర్తవుతాయి.   

మరిన్ని వార్తలు