కాళేశ్వరంలో మళ్లీ ఎత్తిపోతలు

18 Jan, 2021 08:41 IST|Sakshi

కాళేశ్వరం/మంథని: కాళేశ్వరం పథకం ద్వారా మళ్లీ నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని కన్నెపల్లి లక్ష్మీపంపుహౌస్‌లో ఆదివారం ఇంజనీరింగ్‌ అధికారులు రెండు మోటార్లను ఆన్‌ చేసి ఎత్తిపోతలను ప్రారంభించారు. లక్ష్మీపంపుహౌస్‌ నుంచి ఇప్పటికే 11 మోటార్లతో 22 పంపుల ద్వారా గడిచిన రెండు సీజన్లలో నీటిని ఎత్తిపోసిన విషయం తెలిసిందే. కాగా, గతేడాది ఆగస్టులో భారీ వర్షా లతో ఇంజనీర్లు మోటార్లను నిలిపివేశారు. అప్పటి నుంచి పంపుహౌస్‌లో ఎత్తిపోతలు జరగలేదు. 

లక్ష్మీబ్యారేజీకి జలకళ: ఈ నెల 1 నుంచి మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీలోని 85 గేట్లు మూసివేసి నీటిని నిల్వచేస్తున్నారు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16 టీఎంసీల వరకు నిల్వ ఉంది. మేడిగడ్డ నుంచి కాళేశ్వరం వరకు బ్యాక్‌ వాటర్‌ 20 కిలోమీటర్ల మేరకు పెరగడంతో ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు తాజాగా ఎత్తిపోతలు ప్రారంభించారు. 

10.5 టీఎంసీల లక్ష్యం: లక్ష్మీపంపుహౌస్‌ మోటార్ల ద్వారా డెలివరీ సిస్టర్న్‌లో ఎత్తిపోసే నీరు.. అక్కడి నుంచి గ్రావిటీ కాల్వ ద్వారా 13.5 కిలోమీటర్ల దూరాన ఉన్న అన్నారం సరస్వతీ బ్యారేజీలోకి చేరుతుంది. అక్కడి నుం చి ఎగువన ఉన్న లోయర్‌ మానేరుకు 8 టీఎంసీలు, ఎల్లం పల్లికి 2.5 టీఎంసీలు.. మొత్తం కలిపి 10.5 టీఎంసీల నీటిని తరలించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఏకకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ, సరస్వతి, పార్వతి, నంది, గాయత్రి పంపుహౌస్‌లలో రెండు చొప్పున మొత్తం పది మోటార్లు రన్‌ చేస్తున్నారు. వీటి ద్వారా ఒక చోటనుంచి మరో చోటుకు నీటిని ఎత్తిపోస్తున్నారు. 3,150 క్యూసెక్కుల నీటిని మిడ్‌మానేరుకు, అక్కడి నుంచి ఎల్‌ఎండీకి తరలించనున్నారు. 

ఎల్‌ఎండీ ప్రాజెక్టులోకి 8 టీఎంసీల నీరు
బోయినపల్లి(చొప్పదండి): కాళేశ్వరం నుంచి ఎత్తిపోతల ప్రారంభం కావడంతో దానికి అనుగుణంగా శ్రీరాజరాజేశ్వర (మిడ్‌మానేరు) ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న కరీంనగర్‌ ఎల్‌ఎండీ ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం నీటి ని విడుదల చేశారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు 12, 13 గేట్లను ఎత్తడంతో ఒక్కో గేటు ద్వారా 1,500 క్యూసెక్కుల చొప్పు న 3 వేల క్యూసెక్కుల నీరు ఎల్‌ఎండీ ప్రాజెక్టులోకి వెళ్తోంది. గాయత్రి పంప్‌హౌస్‌ నుంచి వరద కాలువ మీదుగా మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి 3 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 25.57 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. మిడ్‌మానేరు నుంచి ఎల్‌ఎండీ ప్రాజెక్టులోకి 8 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు.
 
దేవాదుల పంపింగ్‌ షురూ
కన్నాయిగూడెం(ములుగు): దాదాపు ఐదు నెలల తర్వాత దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నీటి పంపింగ్‌ మళ్లీ ప్రారంభమైంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద ఉన్న జె.చొక్కారావు దేవాదుల పథకంలోని ఫేజ్‌–1, ఫేజ్‌–2లో ఒక్కో మోటారు చొప్పున శనివారం రాత్రి ఇంజనీరింగ్‌ అధికారులు ఆన్‌ చేశారు. 

‘కాళేశ్వరం’ సందర్శనకు పర్యాటకులకు అనుమతి
కాళేశ్వరం: దాదాపు 9 నెలల సుదీర్ఘ విరామం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి కన్నెపల్లి లక్ష్మీ పంప్‌హౌస్‌ వద్ద పర్యాటకుల ప్రవేశానికి అధికారులు అనుమతులు ఇచ్చారు. కోవిడ్‌ నేపథ్యంలో గతేడాది మార్చి 20 నుంచి పర్యాటకులకు అనుమతులు ఇవ్వడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతేడాది జూన్‌ 8న ఆలయాలకు వెళ్లేందుకు భక్తులకు అనుమతులిచ్చినా.. ఇక్కడి పంప్‌హౌస్, బ్యారేజీల్లోకి మాత్రం బ్యారేజీ ఏజెన్సీ సంస్థలు అనుమతించడం లేదు. తాజాగా ఆదివారం నుంచి పంప్‌హౌస్‌లోకి పర్యాటకులను అనుమతిస్తున్నారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు