‘బాహుబలి’ సెంచరీ

25 Feb, 2021 16:05 IST|Sakshi
గాయత్రి పంప్‌హౌస్‌ ద్వారా విడుదలవుతున్న నీరు

మిడ్‌మానేరుకు 100 టీఎంసీలు సరఫరా

రామడుగు/బోయినపల్లి(చొప్పదండి)/కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. ఏడాదిలో 100 టీఎంసీల నీటిని ఎత్తిపోసి కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌ గాయత్రి పంప్‌హౌస్‌లోని బాహుబలి మోటార్లు బుధవారం రికార్డు సృష్టించాయి. ఇక్కడ లిఫ్ట్‌ చేసిన నీటిని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం పరిధిలోని శ్రీరాజరాజేశ్వర జలాశయంలోకి తరలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీపూర్‌ వద్ద నిర్మించిన గాయత్రి పంప్‌హౌస్‌లో ఏడు మోటార్లు బిగించారు. ఒక్కో మోటార్‌ ద్వారా రోజుకు 3,300 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్‌ చేసే సామర్థ్యం వీటి ప్రత్యేకత. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి విడుదలైన నీటిని రామడుగు మండలం లక్ష్మీపూర్‌ గాయత్రి పంప్‌హౌస్‌ నుంచి మిడ్‌మానేరుకు పంపింగ్‌ చేస్తున్నారు.

బుధవారం నాటికి 100 టీఎంసీల నీరు గాయత్రి పంప్‌హౌస్‌ నుంచి మిడ్‌మానేరుకు ఎత్తిపోసినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ నూనె శ్రీధర్‌ తెలిపారు. గాయత్రి నుంచి విడుదలైన నీటిని  శ్రీరాజారాజేశ్వర (మిడ్‌మానేరు) ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేశారు. మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి రెండేళ్లుగా ఎస్సారెస్పీ నుంచి, రామడుగు మండలం లక్ష్మీపూర్‌ గాయత్రి పంప్‌హౌస్‌ నుంచి వరదకాలువ మీదుగా సుమారు 125 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరింది.

ప్రాజెక్టులోకి చేరిన నీటిలోంచి సుమారు 25 టీఎంసీల నీటిని మిడ్‌మానేరు ప్రాజెక్టులో నిల్వ చేసుకుని మిగతా 100 టీఎంసీల నీరు దిగువన ఉన్న ఎల్‌ఎండీ ప్రాజెక్టులోకి, కుడి కాలువ ద్వారా అనంతగరి ప్రాజెక్టుకు సరఫరా చేసినట్లు ఎస్‌ఈ శ్రీకాంత్‌రావు తెలిపారు. మరోపక్క కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్‌ నుంచి నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరి 17 నుంచి బుధవారం వరకు 21.5 టీఎంసీల నీటిని ఆరు మోటార్ల ద్వారా ఎత్తిపోశారు.

చదవండి:
సింగూరు జలాశయంపై 2 భారీ ఎత్తిపోతలు!

మరిన్ని వార్తలు