మనకూ బృందావన్‌ గార్డెన్స్‌

26 Dec, 2020 08:37 IST|Sakshi

మైసూర్‌ కృష్ణరాజసాగర్‌ తరహాలో గార్డెన్లు

ప్రత్యేక థీమ్‌ పార్కులు, ఉద్యానవనాలు, రిసార్టులు

రూ.600 కోట్ల వ్యయంతో 680.44 ఎకరాల్లో పనులు

ప్రభుత్వానికి చేరిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టు కింద వివిధ బ్యారేజీలు, జలాశయాలు, పంప్‌హౌస్‌ల చుట్టూ పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తాం. శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సు, మైసూర్‌ కృష్ణరాజ సాగర్‌ ( బృందావన్‌ గార్డెన్‌) మాదిరిగానే ఒడ్డున ఎక్కువ చెట్లు నాటడం, ఉద్యానవనాలు, సంగీత ఫౌంటెయిన్లు, జలపాతాలు వంటి ఆకర్షణలతో కాళేశ్వరం ప్రాజెక్టును దేశంలో అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మార్చుతాం. అందుకు ప్రణాళిక సిద్ధమైంది. 
– ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్‌

సాక్షి, వరంగల్‌ : తెలంగాణకు తలమానికమైన కాళేశ్వరం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. దేశంలో చరిత్రాత్మక ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ఈ ప్రాంతాన్ని దేశ, విదేశ పర్యాటకులను ఆకట్టుకునేలా మార్చడానికి శ్రీకారం చుడుతున్నారు. కాళేశ్వరం బ్యారేజీలు, పంపుహౌస్‌ల సమీపంలో పర్యాటకులను కనువిందు చేసే కళాకృతుల ఏర్పాటుకు నడుం బిగించారు. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను సిద్ధం చేసే బాధ్యతలను స్వీకరించిన ‘సార్‌ ఇంటర్నేషనల్‌’కన్సల్టెన్సీ.. తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం. 

680.44 ఎకరాలు.. రూ.600 కోట్లు..
సుందరీకరణ, ల్యాండ్‌ స్కేపింగ్, సౌకర్యాల అభివృద్ధికి సంబంధించి 680.44 ఎకరాల్లో చేపట్టే పనులను 9 ప్యాకేజీలుగా విభజించారు. వీటికి మాస్టర్‌ ప్లాన్, డీపీఆర్, ప్రాజెక్ట్‌ ప్రాంత రూపకల్పన బాధ్యతలను సార్‌ ఇంటర్నేషనల్‌కు అప్పగించారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.600 కోట్లకు పైగా ఉంటుందని నిర్ధారించారు. ల్యాండ్‌స్కేప్డ్‌ ఏరియాలోని 145 ఎకరాల్లో 15 ప్రత్యేక థీమ్‌ పార్కులు, ఉద్యానవనాలు ఏర్పాటు చేయనున్నారు. 200 ఎకరాల్లో మూడు సరళి తోటలు, 61 ఎకరాల్లో ఎనిమిది స్మృతివనాలు, 10 ఎకరాల్లో 9 ఆట స్థలాలు, 25.48 ఎకరాల్లో రెండు స్మారక చిహ్నాలు నెలకొల్పుతారు. అలాగే 156.16 ఎకరాలను సుందరీకరణ ప్రాంతాలుగా తీర్చిదిద్దుతారు. వీటితో పాటు బిల్ట్‌ కాంపోనెంట్స్‌ కింద 82.80 ఎకరాల్లో ఎథినిక్‌ రిసార్ట్, ట్రోపికల్‌ రిసార్ట్, ఓర్జన్స్‌ రిసార్ట్‌లు, రెస్టారెంట్‌లు నిర్మించేందుకు వీలుగా ప్రణాళిక సిద్ధం చేశారు.

దీంతో మేడిగడ్డ, కన్నెపల్లి, అన్నారం బ్యారేజీలు, పంపుహౌస్‌లతో పాటు మల్లన్నసాగర్, కొండపోచమ్మ, తుపాకులగూడెం(సమ్మక్కసాగర్‌), దుమ్ముగుడెం ప్రాజెక్టులకు పర్యాటక కళ రానుంది. మరోవైపు ఈ ప్రాజెక్టుల పరిసరాల్లోని బాసర, ధర్మపురి, కాళేశ్వరం, గూడెం గుట్ట, కోటిలింగాల, పర్ణశాల, భద్రాచలం వంటి ప్రసిద్ధ ఆలయాలకు వచ్చే భక్తులు ఈ ప్రాజెక్టు ప్రాంతాలను సందర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ప్యాకేజీలు రూపొందిస్తున్నారు. కాగా, ఈ వ్యవహారం అంతా నిజమేనని, అంతా ప్రభుత్వ స్థాయిలో నడుస్తోందని, అధికారికంగా చెప్పలేమని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

మరిన్ని వార్తలు