వందల టీఎంసీల పంపింగ్‌లో కాళేశ్వరం రికార్డ్‌

16 Mar, 2021 15:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో నిర్మించిన ప్రపంచంలోనే పెద్దదైన బహుళ దశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ఆనతి కాలంలోనే నీటి పంపింగ్‌లో రికార్డ్ సాధించింది. ఈ పథకంలోని ప్రధానమైన నాలుగు పంపింగ్ కేంద్రాల్లో ఒక్కొక్క కేంద్రం నుంచి వంద టీఎంసీల చొప్పున నీటిని ఎగువకు ఎత్తి పోసింది. లింక్-1లోని మేడిగడ్డ లక్ష్మీ దాదాపు 100 టీఎంసీలకు దగ్గరగా ఉండగా, అన్నారం సరస్వతి, సుందిళ్ల పార్వతి, లింక్-2లో ప్యాకేజ్-8 భూగర్భ గాయత్రి పంపింగ్ కేంద్రాల నుంచి మొత్తం మీద 100 టీఎంసీల చొప్పున పంపింగ్‌ను చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడమే కాకుండా ఆనతికాలంలోనే వందల టీఎంసీల నీటిని ఎంఈఐఎల్ పంపింగ్ చేసింది.

దశాబ్దాలుగా నీరందని తెలంగాణ పొలాలు ఇప్పుడు పచ్చని పైరును కప్పుకుని కళకళలాడుతున్నాయి. ఎంతో కాలంగా నీటి కోసం ఎదురుచూసిన రైతన్నలు కాళేశ్వరం నీటి రాకతో తమ బీడు భూములను సస్యశ్యామలం చేసుకుంటున్నారు. ఇంతటి బహుళార్ధక ఎత్తిపోతల పథకం తెలంగాణ దశనే మార్చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం కాశేళ్వరం ప్రాజెక్టుతో జలకళను సంతరించుకుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పట్టుదలతో పాటు మేఘా శక్తి సామర్ధ్యాలతో ఇది సాధ్యమైంది. అతి తక్కువ సమయంలోనే ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది.

కాళేశ్వరంలోని ఏ పంప్ ఎంత నీటిని ఎత్తిపోసిందంటే?
భూ ఊపరితలంపైన అతి పెద్దదైన లక్ష్మీ పంప్ హౌస్‌ను జూలై 6, 2019లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. 522 రోజుల పాటు పని చేసి దాదాపు 100 టీఎంసీల నీటిని పంప్ చేసింది. ఇక కీలకమైన ఈ పంప్ హౌస్‌లో 3వ మిషన్ 1,110 గంటల పాటు పని చేసి నీటిని ఎత్తిపోసింది. అత్యల్పంగా 13వ మిషన్ 262 గంటల పాటు పనిచేసింది. కాళేశ్వరం మొట్టమొదటి పంప్ హౌస్ ఇదే. ప్రాణహిత నీటిని గోదావరిలోకి ఎత్తిపోయడం లక్ష్మీ పంప్ హౌస్ నుంచే ప్రారంభమవుతుంది. లక్ష్మీ పంప్ హౌస్‌ను పార్వతి పంప్ హౌస్‌కు అనుసంధానం చేసే సరస్వతి పంప్ హౌస్ 363 రోజుల పాటు నీటిని ఎత్తిపోసింది. వంద టీఎంసీలను నీటిని ఎగువకు తరలించింది. ఇందులో మొదటి మిషన్ 1,347 గంటలు పాటు పని చేసింది. అతి తక్కువగా 12వ మిషన్ 195 గంటల పాటు పనిచేసింది.

లింక్-1లో చివరిదైన పార్వతి పంప్ హౌస్ సైతం సత్తా చాటింది. ఏకంగా 504 రోజుల పాటు నీటిని పంప్ చేసింది. వంద టీఎంసీల నీటిని ఎత్తిపోసింది. ఇందులో అత్యధికంగా రెండో మిషన్ 1,076 గంటల నీటిని ఎత్తపోసింది. అత్యల్పంగా 14వ మిషన్ కేవలం 333 గంటల పాటు పని చేసింది. అతి కీలకంగా ఉన్న గాయత్రి పంప్ హౌస్ లింక్-2లో భూగర్భ అద్భుతమైన గాయత్రి పంప్ హౌస్‌ను ఆగస్టు 11, 2019లో ప్రారంభించిన మేఘా ఆనతికాలంలోనే 100 టీఎంసీలు ఎత్తిపోసింది. గాయత్రి పంప్ హౌస్ నుంచి ప్రాణహిత నీటిని శ్రీపాద సాగర్‌ ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరుకు తరలించింది. ఈ పంప్ హౌస్‌లో రెండో మిషన్ అత్యధికంగా 1,703 గంటల పాటు నీటిని పంపింగ్ చేయగా, మొదటి మిషన్ 1,367 గంటల పాటు పనిచేసి 111 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసింది. గాయత్రిలోని 7 మిషన్‌లలో ఒక్కొక్క మిషన్ నుంచి 3,150 క్యుసెక్కుల నీటిని విడుదల చేశాయి.

ఇంతవరకూ ఎక్కడా చేపట్టనంతటి భారీ స్థాయిలో పంపుహౌస్‌లను ఈ పథకంలో ఏర్పాటు చేసింది. రోజుకు గరిష్టంగా 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా నిర్మించిన ఈ భారీ పథకంలో 20 పంపుహౌస్‌ల కింద మొత్తం 104 మెషీన్‌లను ఏర్పాటు చేసింది. కాళేశ్వరంలో మొత్తం 22 ఎత్తిపోతల కేంద్రాలు నిర్మించగా అందులో 15 కేంద్రాను మేఘా నిర్మించింది. ఎంఈఐఎల్‌ కాళేశ్వరంలో భారీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణం - ట్రాన్స్‌ మిషన్ల లైన్ల ఏర్పాట్లలో మరో రికార్డ్‌ను సొంతం చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మొత్తం 5,159 మెగావాట్ల విద్యుత్ అంటే అంతే పంపింగ్ సామర్థ్యం మిషన్లు అవసరం కాగా అందులో ఎంఈఐఎల్‌ 4,439 మెగావాట్ల విద్యుత్ అంటే అంత సామర్థ్య పంపింగ్‌తో పాటు  విద్యుత్‌ సరఫరా చేసే 6 సబ్‌ స్టేషన్లు, వాటి లైన్లు నిర్మించింది. సకాలంలో పూర్తి చేసి తన సామర్థ్యాన్ని చాటుకుంది. 

కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన పంప్‌లు, మోటార్లను బీహెచ్‌ఈఎల్‌, ఆండ్రిజ్‌, జైమ్‌ లాంటి అంతర్జాతీయ సంస్థలు సమకూర్చాయి. ఇంతవరకూ ప్రపంచంలో ఒక పంపింగ్‌ కేంద్రంలో 17 మెషీన్లు ఏర్పాటు కావడం ఎక్కడా లేదు. ఒక్క మేడిగడ్డలోనే మొట్ట మొదటిది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంపు హౌస్‌లో ఒక్కొక్కటీ 40 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 43 మెషీన్లను ఏర్పాటు చేశారు. లింక్--1లోని ఈ మూడు పంపుహౌస్‌ల కిందే 1,720 మెగావాట్ల విద్యుత్‌ వినియోగించేలా పంపులు, మోటార్లు ఏర్పాటయ్యాయి. అన్నారం సరస్వతిలో 12 పంపింగ్‌ యూనిట్‌లు, సుందిళ్ల పార్వతి పంపింగ్‌ కేంద్రంలో 14 యూనిట్లు ఆనతి కాలంలోనే పూర్తయ్యాయి. మొత్తం 43 మిషీన్లు వినియోగంలోకి వచ్చాయి.

అన్నిటికన్నా ప్రధానంగా ప్యాకేజీ 8లోని గాయత్రి భూగర్భ పంపింగ్‌ కేంద్రంలో 7 రోజులకు 2 టీఎంసీలు పంపు చేసేలా 7 యూనిట్‌లు వినియోగంలోకి వచ్చాయి. ఇందులో ఒక్కొక్క యూనిట్‌ సామర్ధ్యం 139 మెగావాట్లు. ఇంత భారీస్థాయి పంపింగ్‌ కేంద్రం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ కేంద్రంలో 973 మెగావాట్ల విద్యుత్‌ వినియోగించేలా పంపిగ్‌ సామర్ధ్యం ఉందంటే ఎంతపెద్దదో అర్ధమవుతోంది. ఆ తరువాత రంగనాయక సాగర్‌లోని నాలుగు మెషీన్లను ఒక్కొక్కటి 135 మెగావాట్ల సామర్ధ్యంతో ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేసింది. అన్నపూర్ణ పంప్‌హౌస్‌ల నాలుగు మెషీన్లు ఒక్కొక్కటి 106 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటయ్యాయి.

మరిన్ని వార్తలు