గోదావరి బోర్డుకు కాళేశ్వరం సవరణ డీపీఆర్‌!

8 Sep, 2022 02:35 IST|Sakshi

కేంద్రం సూచన మేరకు సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం 

అదనపు టీఎంసీ పనుల కోసం డీపీఆర్‌ సవరణ 

రూ.1.15 లక్షల కోట్లకు పెరిగిన ప్రాజెక్టు అంచనాలు 

ఇప్పటివరకు రూ.85 వేల కోట్లు ఖర్చు.. 

అవసరం మరో రూ.30 వేల కోట్లు 

రుణాలపై కేంద్రం ఆంక్షలతో రాష్ట్ర ఖజానాపైనే భారం!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సవరణ డీపీఆర్‌ను గోదావరి బోర్డు (జీఆర్‌ఎంబీ)కు సమర్పించింది. తొలుత రోజుకు 2 టీఎంసీల గోదావరి జలాలు ఎత్తిపోసే లక్ష్యంతో కాళేశ్వరాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. దానికి సంబంధించిన అనుమతులన్నీ కేంద్రం నుంచి పొందింది. తర్వాత మరో టీఎంసీ అదనంగా తరలించే పనులను చేపట్టింది. అయితే కేంద్రం ఈ మూడో టీఎంసీ పనులను అనుమతిలేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చుతూ.. ఆరునెలల్లో అనుమతి తీసుకోవాలని 2021 జూలై 15న ఆదేశించింది. అయితే రోజుకు రెండు టీఎంసీలు తరలించే ప్రాజెక్టు, అదనపు టీఎంసీ తరలించే పనులు వేర్వేరు కాదని, రెండూ కాళేశ్వరంలో అంతర్భాగమేనని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరించింది. సీఎం కేసీఆర్‌ స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనితో సవరించిన కాళేశ్వరం డీపీఆర్‌ను సమర్పించి అనుమతులు పొందాలని కేంద్రం సూచించింది.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సవరణ డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు సమర్పించి హైడ్రాలజీ, కాస్ట్‌ అప్రైజల్‌ అనుమతులు పొందింది. తాజాగా రూ.1.15 లక్షల కోట్ల అంచనాతో సవరించిన డీపీఆర్‌ను గోదావరి బోర్డుకు అందించింది. గోదావరి బోర్డు డీపీఆర్‌పై సాంకేతిక పరిశీలన జరిపాక.. సీడబ్ల్యూసీ టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ ఓకే చేస్తుంది. చివరిగా అపెక్స్‌ కౌన్సిల్‌లో డీపీఆర్‌పై చర్చించి ఆమోదముద్ర వేస్తారు. 

మరో రూ.30వేల కోట్లు: కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే రూ.85 వేలకోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. కొత్త డీపీఆర్‌ ప్రకారం మిగతా పనుల పూర్తికి ఇంకో రూ.30వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీతోపాటు పలు బ్యాంకుల నుంచి కాళేశ్వరం కార్పొరేషన్‌కు రావాల్సిన రుణాలు ఏప్రిల్‌ నుంచి నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరంతోపాటు ఇతర ప్రాజెక్టుల పనులకు రాష్ట్ర బడ్జెట్‌ నిధులే దిక్కు అని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: కాళేశ్వరం వృథా కాదు.. ఆదా!

 

మరిన్ని వార్తలు