‘సోషల్‌ మీడియాకు బందీ కావొద్దు’.. కాళోజీ పురస్కార గ్రహీత శ్రీరామోజు హరగోపాల్‌

10 Sep, 2022 02:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటి తరాన్ని స్మార్ట్‌ ఫోన్‌ నిర్వీర్యం చేస్తోందని.. సోషల్‌ మీడియా బందీగా మార్చిందని ప్రముఖ కవి, రచయిత, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్‌ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో మునిగిపోయినప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకున్నట్టే అనిపిస్తుందని.. కానీ ఏమీ తెలియకుండా పోతుందని చెప్పారు. శుక్రవారం ఆయన కాళోజీ నారాయణరావు స్మారక పురస్కరాన్ని అందుకున్నారు. అనంతరం ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘నేను ఎనిమిదో తరగతి నుంచి కవిత్వం రాయడం అలవాటు చేసుకున్నా. అది నాలో ఆలోచనా శక్తిని ఉత్తేజపర్చింది. సమాజాన్ని అన్ని కోణాల్లో చూసే తత్వాన్ని కలిగించింది. అన్యాయం జరిగితే ప్రశ్నించడం, బాధితుల పక్షాన నిలదీయటం, ఎదిరించటం అలవాటు చేసింది. ఇప్పటితరంలో ఇది లోపించింది. రాయకున్నా కనీసం చదివే లక్షణమైనా ఉండాలి..’’ అని శ్రీరామోజు హరగోపాల్‌ పేర్కొన్నారు.

భాషను ముందు తరాలకు అందించాలి
తెలంగాణ భాషను రేపటి తరానికి పదిలంగా అందించాల్సిన బాధ్యత మనపై ఉందని.. అది రచనలతోనే ముందుకు సాగుతుందని శ్రీరామోజు హరగోపాల్‌ అన్నారు. ‘బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కావాలని కాళోజీ చెప్తూ చేసి చూపించారని.. ఆ దిశగానే తానూ ముందుకు సాగానని చెప్పారు. తమ రచన సాహితీ కళావేదిక తొలి వార్షికోత్సవానికి కాళోజీ ముఖ్య అతిథిగా వచ్చి ఓ రోజంతా తమతో గడిపారని గుర్తు చేసుకున్నారు. సమాజంలో చోటుచేసుకునే పరిణామాలకు మనం స్పందించగలగాలని.. ఆ తత్వం మనసుకు ఉండాలని చెప్పారు. చాలా మందిలో ఈ తత్వం ఉన్నా దాన్ని గుర్తించరని.. రచనా వ్యాసంగం వైపు మళ్లినప్పుడు అది ఉత్తేజం పొందుతుందని తెలిపారు. సమాజాన్ని గమనించటం, పుస్తకాలు చదవడం మేధస్సుకు పదును పెడుతుందన్నారు. దీనిని నేటి తరం గుర్తించాలని సూచించారు. 

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వైతాళికులను గుర్తించి వారికి సముచిత గౌరవాన్ని కల్పిస్తోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. కాళోజీ జయంతిని అధికారికంగా నిర్వహించడంతోపాటు ఆ రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించిందని గుర్తు చేశారు. శుక్రవారం రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి శ్రీరామోజు హరగోపాల్‌కు కాళోజీ పురస్కారాన్ని ప్రదానం చేశారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీ, కవి గోరటి వెంకన్న, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్‌ గౌరీశంకర్‌ పాల్గొన్నారు.  – గన్‌ఫౌండ్రి

ఇదీ చదవండి: పాన్‌ ఇండియా పార్టీ.. దరసరాకు విడుదల!

మరిన్ని వార్తలు